జగన్ ఆ ఒక్క లోటు కూడా తీర్చేస్తాడా... రాజ్యసభలో మహిళా ఎంపీ...!
పార్లమెంటులో కీలకమైన రాజ్యసభకు ఇప్పటి వరకు గతంలో టీడీపీ పంపించిన ఒక మహిళా నాయకురా లు తప్ప.. వైసీపీ నుంచి ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహించిన మహిళా నేత కనిపించడం లేదు. ప్రస్తు తం ఆరుగురు రాజ్యసభ సభ్యులు వైసీపీకి ఉన్నారు. విజయసాయిరెడ్డి, నత్వానీ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ప్రభాకర్‌రెడ్డి సభ్యులుగా రాజ్యసభలో ఉన్నారు. ఇప్పటి వరకు రాజ్యసభకు వైసీపీ తరఫున మహిళా అభ్యర్థులను అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ఎవరి పేరునూ పరిశీలించనూ లేదు.
ఎప్పుడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్తులను పరిశీలిస్తున్నారనే వార్తలు వచ్చినా.. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు ప్రముఖంగా వినిపించేది. ఆమె కూడా ఆశించారు. అదేవిధంగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరు కూడా వినిపించేది. కానీ, ఇప్పుటి వరకు వీరిని పంపించలేదు. దీంతో మహిళలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరి ఇప్పుడైనా.. నాలుగు స్థానాలు వైసీపీకి అందుబాటులో కి రానున్నాయి. దీనిలో ఒక్కస్థానాన్నయినా.. మహిళలకు కేటాయిస్తారా ? అనే చర్చ వైసీపీలో జరుగుతోంది.
ఇది ఒక్క లోటును భర్తీ చేస్తే... అన్ని పదవుల్లోనూ మహిళలకు వైసీపీ ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందని.. విపక్షాలకు విమర్శించే అవకాశం లేకుండా పోతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే మహిళా కోటాలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరు రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. మరి సీఎం జగన్ ఈ సారైనా మహిళలకు ఒక్కసీటు కేటాయిస్తారేమో .. చూడాలి.