కత్తి మీద సాము: ఉద్యోగులతో జగన్‌ డేంజర్‌ గేమ్..?

ఆంధ్రప్రదేశ్‌లో కొన్నిరోజులుగా ఉద్యోగుల పీఆర్సీ అంశం ప్రధాన వార్తాంశంగా మారింది. జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులను ఆకట్టుకునేందుకు 27 శాతం మధ్యంతర భృతి అంటే ఐఆర్‌ ఇచ్చారు.. మధ్యంతర భృతి అంటే.. పీఆర్సీ కమిషన్ వేసి నిర్ణయం తీసుకుని ఫిట్‌మెంట్‌ ఎంత ఇవ్వాలో తేల్చే వరకూ సర్దుబాటుగా ఇచ్చే ఫిట్‌మెంట్‌ లెక్క. సాధారణంగా పీఆర్సీ తర్వాత వచ్చే ఫిట్‌మెంట్‌ ఈ మధ్యంతర భృతి కంటే ఎక్కువే ఉండడం ఇప్పటి వరకూ చరిత్రలో ఉన్న అంశం.


కానీ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ సర్కారు ఫిట్‌మెంట్‌ను ఐఆర్‌ కంటే తక్కువగా 23 శాతం నిర్ణయించింది. అంటే ఉద్యోగులకు రావాల్సింది 23 శాతం ఫిట్‌మెంటే అన్నమాట. మరి ఈ రెండేళ్లూ 23 కాకుండా మధ్యంతర భృతి కింద 27 తీసుకున్నారు.. కాబట్టి ఆ నాలుగు శాతం ఇప్పుడు జీతాల్లో కోతపడుతుంది. ఇది చరిత్రలోనే కొత్త నిర్ణయం అంటున్నారు. నిజమే మరి.. కరోనా వంటి గడ్డు కాలం కూడా చరిత్రలో కొత్తదే.. రాష్ట్రాల ఆదాయాలు పడిపోవడం కూడా కొత్తే కదా.


మొదట్లో ఉద్యోగుల సమస్య పరిష్కారం అయినట్టే అయ్యింది. సీఎంతో ఉద్యోగ సంఘాల భేటీ తర్వాత అంతా ఆనందంగానే బయటకి వచ్చారు. కానీ.. సీఎంతో భేటీలో కొన్ని అంశాలపై క్లారిటీ రాలేదు.. ఆ అంశాలే ఇప్పుడు ఇంత గ్యాప్‌ కు కారణం అయ్యాయి. అయితే.. జగన్ సర్కారు మాత్రం ఏమాత్రం రాజీపడబోమని చెబుతోంది. అటు ఉద్యోగులు కూడా తగ్గబోం అంటున్నారు. దీంతో సమస్య జఠిలం అయ్యింది. అయితే సహజంగానే ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలకు కోపం ఉంటుంది. దాన్నే ఇప్పుడు జగన్ రాజకీయంగా వాడుతున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.


కరోనా వల్ల సమాజం అంతా ఇబ్బందుల్లో ఉంటే... మాకు మాత్రం అంత కావాలి..ఇంత కావాలి అని డిమాండ్ చేయడం ఏంటని జనం భావిస్తున్నారు. జగన్ కూడా దీన్నే అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కానీ.. ఉద్యోగులతో వైరం పెట్టుకోవడం రాజకీయంగా ఎంత వరకూ లాభిస్తుందన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక్కటి స్పష్టం.. జగన్ మాత్రం డేంజరస్‌ పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఫలితం ఎలా ఉంటుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: