హ్యాపీ సండే : ఉద్యోగులంటే పీఆర్సీ.. హెఆర్ఏ..డీఏ..ఇంకేం కాదా?
ఈ క్రమంలో తాజాగా బొప్పరాజు (అమరావతి జేఏసీ చైర్మన్) హెచ్ఆర్ఏకు సంబంధించి కొత్త డిమాండ్ ఒకటి తెరపైకి తెచ్చారు.అద్దె భత్యం అన్నది అలానే కొనసాగించాలని,ఇదివరకు ఉన్న విధంగానే హెచ్ఆర్ఏ శ్లాబులను కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వానికి విన్నవించారు.హెచ్ఆర్ఏ,అదనపు పింఛను విషయంలో తాము సీఎస్ కమిటీ చెప్పిన మాటలు పట్టించుకోవద్దనే చెప్పాం అని అంటున్నారీయన.వాస్తవానికి రాష్ట్ర విభజన అనంతరం ఎక్కువగా ఆర్థిక లబ్ధి పొందింది ఉద్యోగులే.సమైక్యాంధ్ర ఉద్యమ కాలానికి సంబంధించి 81 రోజులను ప్రత్యేక సెలవుగా పరిగణింపజేసుకుని తద్వారా ఆర్థిక లబ్ధి అందుకున్నది ఉద్యోగులే.
ఆ తరువాత శ్రీకాకుళం, చిత్తూరు ఉద్యోగులు ఇరవై శాతం హెచ్ఆర్ఏ పొందారు.ఇవే కాకుండా చాలా ప్రయోజనాలు పొందారు.కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా చైల్డ్ కేర్ లీవ్ 60 రోజుల పాటు ఇవ్వాలని కూడా పట్టుబట్టి సాధించారు.ఆ తరువాత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇదే నియమం వర్తింపజేయాలని పట్టుబట్టి సాధించారు.వాస్తవానికి ఇదొక్కటే మానవీయ దృక్పథంతో ఆ రోజు ఏపీ ఎన్జీఓ సంబంధిత వర్గాలకు చేసిన గొప్ప సాయం.
అసలే అరకొరజీతాలతో కాలం వెళ్లదీసే తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ వర్తింపజేయడం ఓ ఉపశమనం.సంబంధిత పని కాలానికి వేతనం చెల్లించేలా ఆ రోజు సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారు కూడా! ఇన్నిచేసినా పోస్టల్ బ్యాలెట్-లో ఆయనకు వ్యతిరేకంగా ఓటేశామని బాహాటంగానే చెప్పి,జగన్ కు మద్దతు ఇచ్చారు.సీపీఎస్ రద్దు విషయమై సానుకూలంగా ఉన్నారన్న ఒకే ఒక్క వాదనతో ఏకీభవించి ఆరోజు అటు రెగ్యులర్ ఇటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఇలా అంతా కలిపి ఏకతాటిపై నిలిచి జగన్ పార్టీకి మద్దతు ఇచ్చారు.
ఇప్పుడు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను పట్టించుకునే స్థితిలో జగన్ లేరు..పోనీ గ్రామ సచివాలయ ఉద్యోగుల (జిల్లా ఎంపిక బృందాల ద్వారా విధుల్లోకి వచ్చిన వారు వీరంతా) ప్రొహిబిషన్ పిరియడ్ కన్ఫం చేశారా అంటే అదీ లేదు. ఇన్ని సమస్యలున్నా కూడా క్రమం తప్పకుండా వేళ తప్పకుండా పనిచేస్తున్నది గ్రామ సచివాలయ ఉద్యోగులే అని ప్రజల నుంచి కూడా వస్తున్న అభినందన.మంచి స్పందన.ఇవన్నీ కాదని ఉద్యోగికి మేలు చేసి జగన్ ఓ విధంగా ఆర్థిక భారం మోయడమే తప్ప,డీఏ బకాయిలు తీర్చి ఎంతో కొంత ఉపశమనం కలిగించడం తప్ప,వీళ్ల నుంచి జగన్ కు కొత్తగా దక్కే మద్దతు ఏమీ లేదు.డీఏ (కరువు భత్యం) బకాయిలు,హెచ్ఆర్ఏ(అద్దె భత్యం) వర్తింపులు ఇవి తప్ప మరో ధ్యాస లేని ఉద్యోగులకు పాలనపై అస్సలు శ్రద్ధ లేదు.
కార్యాలయాల నిర్వహణపై అస్సలు కనీస శ్రద్ధ లేదు. అయినా కూడా జగన్ వీళ్లను ఏమీ అనకపోవడమే ఆశ్చర్యకరం.ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి కన్నా యాభై ఇళ్లకో 70 ఇళ్లకో నియమితుడయిన గ్రామ లేదా వార్డు వలంటీరు ఎంతో బాగా పనిచేస్తున్నారు కొన్ని చోట్ల..అక్కడక్కడా రాజకీయ ప్రమేయం ఉన్నా కూడా వీరి నియామకంలో కొన్ని తప్పిదాలు ఉన్నా కూడా..ఓ 80 శాతం మంది మంచి ఫలితాలే తీసుకువచ్చి,జగన్ చెప్పిన విధంగా విధి నిర్వహణ చేస్తున్నారు.
మళ్లీ వీరి జీతమా పెంచలేదు. ఎనిమిదివేలుచేస్తామని చెప్పి రెండున్నరేళ్లు దాటి పోయింది.అయినా కూడా ఆ ఐదు వేలు జీతానికే గ్రాడ్యుయేట్లు,పోస్టు గ్రాడ్యుయేట్లు గ్రామాల్లో,పట్టణాల్లో పనిచేస్తూ నిబద్ధతకు కేరాఫ్ అవుతున్నారు.ఈ పాటి కూడా పనిచేయని ఉద్యోగులపై ఇవాళ ఎటువంటి నిఘా లేదు.ఆకస్మిక తనిఖీలు లేవు. నెలవారీ సమీక్షల్లో అరుపుల్లేవు,కేకల్లేవు. అసలు ఏసీబీ దాడులే లేవు.ఇంతగా సహకరిస్తున్న జగన్ కు వీళ్లు ఇచ్చేదేంటి బాబు మాదిరే నెత్తిన బండ పెట్టి పోతారేంటో?