కేసీఆర్‌.. ఇంటర్‌ ఫలితాలు చెబుతున్న రహస్యం విన్నారా..?

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు సగం మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. సాధారణంగా ఇంటర్‌లో పాస్‌ పర్సెంటేజీ 70 శాతంపైగానే ఉంటుంది. కానీ.. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఫలితాలు దారుణంగా పడిపోయాయి. ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలయ్యామన్న ఆందోళనతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే.. గతంలోనూ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయి. కానీ.. ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలు, విద్యార్థుల ఆందోళలను తేలిగ్గా తీసుకోకూడదు.

ఇంటర్ ఫలితాలను కేవలం ఇంటర్‌కే పరిమితం చేసి చూడకూడదు. ఇంటర్ ఫలితాలు కరోనా తర్వాత విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులకు ఇవి సంకేతాలుగా అర్థంచేసుకోవాలి. అంతేకాదు.. ఈ దుష్ఫలితాలు కేవలం ఇంటర్‌ కే పరిమితంగా చూడకూడదు. కరోనా తర్వాత విద్యావ్యవస్థలో ఏర్పడిన దుష్ఫరిణామాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కరోనా సమయంలో పాఠశాలలు తెరుచుకోలేదు. కేవలం ఆన్ లైన్ క్లాసులు మాత్రమే జరిగాయి. అవి ఎంత బాగా జరిగాయో అందరికీ తెలుసు.

కరోనా తర్వాత చాలాచోట్ల అమలవుతున్న ఆన్‌లైన్‌ క్లాసుల డొల్లతనాన్ని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. కరోనా సమయంలో అనేక మంది పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఉంటే.. ఎవరో ఒకరు మాత్రమే ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేవారు. దీనికితోడు అనేక సాంకేతిక సమస్యలు, డాటా సమస్యలు, సిగ్నళ్ల సమస్యలు.. ఇన్ని ఆటంకాల మధ్య పిల్లల చదువులు సాగాయి. మరి వీటి ప్రభావం చదువుపై ఎలా ఉందన్న అతి ముఖ్యమైన సమస్యపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయించిన దాఖలాలు లేవు.

కేవలం సిలబస్ తగ్గించాం, ఛాయిస్ పెంచాం అనే తరహాలోనే ఇంటర్‌బోర్డు ఆలోచించింది తప్పితే.. అసలు పిల్లలు పరీక్షలకు సిద్ధమయ్యారా.. ఎంతవరకూ వారికి పాఠాలు అర్థమయ్యాయి.. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అన్న సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఇకనైనా ఈ ఆన్‌లైన్‌ పాఠాల ప్రభావంపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి.. అందుకు అనుగుణంగా పరీక్షల విధానంలోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: