నాయకుల ధర్నాలు వారి పార్టీల కోసమా.. రైతుల కోసమా..!

MOHAN BABU
  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాలలోని వరి పంట వర్షంలో తడిసి నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించిన సందర్భంగా మాట్లాడుతూ ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రాంతంలో   రోడ్డు మీద ఉన్న వరికుప్పల పై పడుకున్న రైతులు ప్రమాదాల్లో చనిపోతున్న విషయo పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగం పండించిన పంటకు ఆర పోసుకోవడానికి లేదా నిల్వ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో గోదాముల సౌకర్యం సరిగా లేకపోవడం వలన ఇలాంటి దుర్భర పరిస్థితులు ఏర్పడుతు న్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన తక్షణ బాధ్యతగా పండించిన ధాన్యాన్ని గత నెల రోజులకు పైగా కొనుగోలు చేయకుండా తాత్సారం చేసి రైతుల ఇబ్బందులకు కారణం అవుతున్న విషయం పట్ల బిజెపి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా కళ్ళలో ఉన్న ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వంచే
 కొనిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం ద్వారా ఉద్యమం తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడాన్ని రైతాంగం గమనించవలసి ఉంటుంది.
     రైతాంగం సూటి ప్రశ్న:
    కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర ఆరోపణలు చేసుకుంటూ బాధ్యత మరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర రైతాంగం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నది. ఒకవైపు  ధాన్యం వర్షంలో తడిసి పోతుంటే పట్టించుకోకపోవడం కాకుండా ధర్నాలు చేయడమే మీ బాధ్యతా? అని అనేకమంది రైతులు అక్కడక్కడ ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సమాధానం ఇచ్చిన తర్వాత కూడా యాసంగి పంట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం పట్ల రైతులు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
     ఒకవైపు దేశవ్యాప్తంగా గోదాములలో వరి ధాన్యం నిల్వ ఉండడం ఉత్తర భారత దేశంలో గోధుమతో గోదాములు నిండిపోగా ప్రత్యామ్నాయ ఆహార పదార్థాల పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అటువంటి అవసరం ఉన్నది. సిరి ధాన్యాలు, చిరుధాన్యాలు, ఆహార అనుబంధ పంటలను, వాణిజ్య పంటలను ప్రత్యామ్నాయంగా వేసుకోవడం ద్వారా చౌకగా ప్రజానీకానికి అందించడమే కాకుండా రైతులకు కూడా లాభసాటిగా వుంటుంది అని వ్యవసాయరంగ నిపుణులు, కొంతమంది మేధావులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నారు.


      కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వ్యవసాయరంగ నిపుణులు, రైతు సంఘాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థిక వేత్తలతో సమావేశాన్ని  ఏర్పాటు చేసి నీటి సౌకర్యం ,భూముల స్వభావం, రైతు ఆర్థిక పరిస్థితి, దేశ ఆహార అవసరాలు, ప్రత్యామ్నాయ పంటలు మొదలగు అంశాల పైన సమగ్రమైన చర్చ చేసి వ్యవసాయ విధానాన్ని ఎప్పటికప్పుడు ప్రకటించుకోవడం ద్వారా ప్రభుత్వాలు బాధ్యతను నిర్వహించాలి. కానీ ప్రచారం కోసం రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాలే ధర్నాలకు దిగడం హైదరాబాదులో ఇటీవల  ప్రభుత్వం నిర్వహించిన ధర్నా పరుపులు, ఏసీలు, కూలర్లు వంటి సకల సౌకర్యాలు చూస్తే నిజమైన ధర్నా లాగా లేదని అనేక మంది జర్నలిస్టులు అంటున్నారు. నిజంగా నిరసన వ్యక్తం చేసే ఉద్యోగులు, జర్నలిస్టులు, నిరుద్యోగులు, మహిళా సంఘాలు, అంగన్వాడీలు, చిరుద్యోగులు తమ హక్కుల కోసం పోరాడిన సందర్భంలో ధర్నా చౌక్ లో ధర్నాలు నిర్వహించిన సందర్భంలో ఏసీలు, కూలర్లు, పరుపులు మెత్తలు వంటి సకల సౌకర్యాలతో నిర్వహించినారా? ఒక్కసారి ఆలోచించాలి. సకల సౌకర్యాలతో చేసినది ధర్నా కాదు. ఎండ, వాన ,చలి లో అనేక ఇబ్బందుల లో చేసేదే నిజమైన  నిరసన ప్రదర్శన. ఢిల్లీలో ఇంతకాలంగా చేస్తున్న రైతుల నిరసనలు ఆకలి, ఆవేదన, అవసరము నుండి పుట్టినవి. ఉద్యమాలు ఎప్పుడూ కూడా సుఖాన్ని, సౌఖ్యాన్ని, సౌకర్యాలను కోరుకోవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: