
ప్రపంచమే శభాష్ ఇండియా అంటోందిగా..?
అయితే.. ఇలాంటి విషమ పరిస్థితుల్లోనూ ఇండియా ప్రపంచంలో తన వంతు బాధ్యతను నెరవేర్చింది. ఇప్పటి వరకూ విదేశాలకు ఇండియా 6.5కోట్లకుపైగా కరోనా టీకా డోసులు ఎగుమతి చేసింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వివరించారు. భారత్ ఈ ఏడాది వంద దేశాలకు 6.5కోట్లకుపైగా కరోనా టీకా డోసులు ఎగుమతి చేసిందని మోడీ వివరించారు. ఈ ఎగుమతుల ద్వారా భారత్ ప్రపంచ దేశాల విశ్వాసం చూరగొందని ఆయన అన్నారు. అంతే కాదు.. భారత ఆరోగ్య రంగం కూడా గ్లోబల్ ఫార్మాగా పిలవబడుతోందని ప్రశంసించారు.
దేశంలో ఫార్మా రంగం తొలి ప్రపంచ నూతన ఆవిష్కరణ సదస్సు ప్రారంభ ఉపన్యాసంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు తెలిపారు. ఈ కరోనా ద్వారా భారత సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. కరోనాకు టీకా అందించిన దేశాల జాబితాలో ఇండియా కూడా చేరింది. ఇండియా దేశీయ ఫార్మా రంగాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లే సత్తా ఏంటో తెలిసింది. ఇండియాలో ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ఉన్నారని ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఇండియా శక్తి, నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి.
భారత్ ఇదే స్ఫూర్తి కనపరచాలి. మేడిన్ ఇండియా నినాదంతో పరిశ్రమించాలి. 130 కోట్ల మంది ప్రజలు స్వావలంబనను కోరుకుంటున్నారు. అందుకే.. ఇప్పుడు టీకాలు, ఔషధాల్లో ఉపయోగించే కీలక ముడి పదార్థాలను దేశీయంగా తయారు చేయటం ఇండియా ముందున్న సవాలు. దేశం ముందున్న ఈ సవాల్‌ను జయించాల్సిన అవసరం ఉంది.