బాబోయ్.. ఈ భూమిని లక్షల సార్లు పేల్చేస్తారా..?

ఈ భూమి ఎప్పుడు పుట్టి ఉంటుంది.. బహుశా కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం.. ఈ భూమిపై ఎప్పుడు జీవం ఆవిర్భవించి ఉంటుంది. బహుశా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం.. అప్పటి నుంచి జీవం ఎన్నో పరిణామాలు చెంది.. ఈనాటి మనిషిగా మార్పు చెందింది. దీని వెనుక ఎంతో జీవ పరిణామం ఉంది. అయితే.. ఇంతగా మార్పు చెందిన ఆధునిక మానవుడే.. ఈ జీవరాశి అంతానికి కారణం అవుతుండటమే అసలైన విషాదం. ఈ భూమి మీద ఉన్న జీవరాశిలో అత్యంత తెలివైన జీవిగా చెప్పుకునే మనిషే.. అత్యంత మూర్ఖత్వంతో ప్రవర్తిస్తుండటం సృష్టి వైపరీత్యంగానే చెప్పుకోవాలి.

ఎందుకంటే.. మానవుడు కనిపెట్టిన అనేక అద్భుత ఆవిష్కరణల్లో అత్యంత ప్రమాదకరమైన వాటిలో అణు బాంబు ఒకటి. ఒక్క అణు బాంబు పడితే.. ఆ ప్రాంతం భస్మీపటలం అవుతుంది. ఆ ప్రాంతంలోని అన్ని జీవరాశులు హరీమంటాయి. కొన్నేళ్ల వరకూ అక్కడ గడ్డి కూడా మొలవదు. 1945లో మొదటి సారి ఈ అణు బాంబు ప్రయోగం జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై జరిగింది. అదే మొదలు.. అదే తుది కూడా. కానీ.. అనేక దేశాలు అణ్వాయుధాలను భారీగా పోగేసుకుంటున్నాయి.

అణు సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్క దేశం కూడా.. అబ్బే మేం మొదటి సారి దాడి చేయబోం.. ఆత్మరక్షణ కోసమే అణ్వాయుధాలు పోగేసుకుంటున్నామని లౌక్యపు పలుకులు పలుకుతున్నాయి. స్టాక్‌హోం శాంతి కమిటీ లెక్కల ప్రకారం.. రష్యా దగ్గర అత్యధికంగా 6 వేల వరకూ అణ్వాయుధాలు ఉన్నాయట.. ఆ తర్వాత అమెరికాలో దాదాపు 5 వేలకుపైగా అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయట. చైనా వద్ద 350 వరకూ అణ్వాయుధాలు ఉన్నాయట.

ఆ స్థాయిలో కాకపోయినా.. బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా, పాక్‌, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాల వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ తయారైన అణ్వాయుధాలతో ఈ భూమిని కొన్ని వేల సార్లు పేల్చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదీ అణ్వాయుధాల ద్వారా పొంచి ఉన్న ముప్పు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: