ఆపరేషన్‌ షర్మిల: 'వైఎస్‌' మంత్రులకు విజయమ్మ ఫోన్?

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి.. పాలించింది తక్కువ సమయమే అయినా తనదైన ముద్ర వేసిన నాయకుడు ఆయన.. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్‌ వంటి పథకాలతో ఆయన రెండు రాష్ట్రాల పేద ప్రజలకు దేవుడిగా మారారు. రెండోసారి సైతం కాంగ్రెస్‌ను గెలిపించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా.. అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదానికి గురై అకాల మరణం చెందినా.. అలాగే ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. సెప్టెంబర్‌ 2 వైఎస్‌ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజు. మరికొన్నిరోజుల్లోనే వైఎస్‌ వర్థంతి రాబోతోంది. ఈ సమయంలో ఓ ఆసక్తికరమైన రాజకీయ ఘట్టం చోటుచేసుకోబోతోంది.

మాజీ సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబరు 2న ఆయన సతీమణి విజయమ్మ హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని గతంలో వైఎస్‌తో సన్నిహితంగా పని చేసిన వారిని ఆహ్వానిస్తున్నారట.

వైఎస్‌ ఆత్మగా పిలవబడిన మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వైఎస్‌తో బాగా చనువు ఉన్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, మాజీ స్పీకర్‌ కె.ఆర్‌ సురేష్‌రెడ్డి వంటి వారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తారట. వీరితో పాటు గతంలో వై.ఎస్‌.మంత్రివర్గంలో పనిచేసిన వారిని, రాజకీయ సహచరులను, శ్రేయోభిలాషులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారట. వీరందర్నీ విజయమ్మ స్వయంగా ఫోన్‌చేసి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.

 
అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారనేది పొలిటికల్‌ సర్కిల్లో ఆసక్తికమైన చర్చకు దారి తీస్తోంది. గతంలో ఎన్నో వైఎస్ వర్థంతులు వచ్చినా ఇలా నిర్వహించలేదు. ప్రస్తుతం వైఎస్‌ కుమార్తె షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినందువల్ల మరోసారి వైఎస్‌ బ్రాండ్‌ను ప్రజలకు గుర్తు చేసేందుకు.. అలాగే సదరు నేతలను షర్మిల పార్టీలోకి ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. చూడాలి.. ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: