జగన్ తొలిసారి తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయం ఇదే..!

Deekshitha Reddy
ఇప్పటి వరకూ సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలపై ఎక్కడా ఎలాంటి వ్యతిరేకత రాలేదు. మద్యం ధరలు భారీగా పెంచడం, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం వంటి తటస్థ నిర్ణయాల్లో కూడా జగన్ కే ప్రజా మద్దతు ఎక్కువగా ఉంది. కానీ తొలిసారి జగన్ తెలిసి తెలిసి తప్పు చేస్తున్నట్టు అనిపిస్తోంది. అవును, సీఎం జగన్ తీసుకున్న, అమలులో పెడుతున్న తాజా నిర్ణయమే ఆయనపై ప్రజా వ్యతిరేకత పెంచుతుందని అంటున్నారు. ఆస్తిపన్నుని భారీగా పెంచుతున్న ఈ సందర్భంలో.. ప్రజలు కచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉంది.
గతంలో ఆస్తి పన్ను పెంపు అనేది కేవలం ప్రతిపాదనే అన్నారు. ఆ తర్వాత కొత్త లెక్కల ద్వారా ఆస్తి పన్ను పెద్దగా పెరగదని సర్ది చెప్పుకున్నారు మంత్రులు. తీరా ఇప్పుడు పెరిగిన పన్ను వసూళ్లకు రెడీ అవుతున్నారు. కొత్త ఆస్తి పన్ను విధానాన్ని ప్రజలు వ్యతిరేకించినా, మాపై భారం మోపొద్దంటూ ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం మారలేదు, పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినా పాలకవర్గాలు పట్టించుకోలేదు. 45శాతం పురపాలక సంస్థలు, నగర పాలక సంస్థల్లో కొత్త పన్ను విధానానికి అనుకూలంగా తీర్మానాలు చేశారు. గెజిజ్ కూడా ప్రచురించారు. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను వసూలు చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధమైంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చినట్టయింది. దీని ప్రకారం ఇప్పుడు అధికారులు, సిబ్బంది వసూళ్లకు రెడీ అవుతున్నారు.
నెలాఖరులోగా పెంచిన ప్రతిపాదనలు సిద్ధం చేసి, సెప్టెంబర్ 15లోగా ఇళ్లు, భవనాల వారీగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు అధికారులు. ఈ నోటీసుల ప్రకారం ప్రజలు 2021-22 ఆర్థిక సంవత్సరానికి పెరిగిన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో ఇప్పటికే చాలామంది ముందస్తు అర్థ సంవత్సర పన్ను చెల్లించి ఉన్నారు. అయితే వారు కూడా పెరిగిన రేట్ల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మార్చిలోగా ఏడాది పన్ను మొత్తం ప్రజలు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్లను అధికారులు ఆదేశించారు. దీంతో ఇకపై బకాయిలు అనేది ఉండకుండా పన్ను వసూళ్లకు దిగుతున్నారు అధికారులు.
సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందుకుంటున్న లబ్ధిదారులంతా పెరిగిన ఆస్తి పన్నుతో ఇబ్బంది పడతారు. అదే సందర్భంలో తమకు వచ్చిన సాయం, ఇలా ప్రభుత్వమే తీసుకుంటోందనే ఆలోచన కూడా వారిలో వస్తుంది. ఇది పరోక్షంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేదిగా ఉంటుంది. ఆస్తి పన్ను, కరెంట్ చార్జీలు పెంచితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఆందోళనకు దిగుతాయి. అవే పార్టీలు అధికారంలోకి రాగానే అన్నీ మరచిపోయినట్టు పన్నుల పెంపుని సాధారణ విషయంగా పరిగణిస్తుంటాయి. కానీ ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తుంటారనే విషయాన్ని అన్ని పార్టీలు గుర్తుంచుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: