సజ్జనార్‌.. ఆర్టీసీ నష్టాలను ఎన్‌కౌంటర్‌ చేస్తారా..?

వీసీ సజ్జనార్.. తెలుగు రాష్ట్రాల్లో కాస్త లోకజ్ఞానం ఉన్నవాళ్లు ఈ పేరు తెలియకుండా ఉండరు. ప్రత్యేకించి వరంగల్ యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్, శంషాబాద్‌ దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనలతో ఆయన పేరు మారుమోగిపోయింది. ఒకవిధంగా ఆయన ఎన్‌కౌంటర్ల ద్వారా బాధితులకు తక్షణ న్యాయం అందించారన్న పేరు తెచ్చుకున్నారు. కానీ.. ఈ తక్షణ న్యాయం రాజ్యాంగ విరుద్ధం.. అందుకే రాజ్యాంగ విరుద్ధమైన పనులను రాజ్యాంగ పద్దతిలోనే సమాధానం చెప్పుకునేలా సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కథలు వినిపిస్తుంటారు.


ఏదేమైనా సజ్జనార్‌.. ఆ ఎన్‌కౌంటర్ల విషయంలో తక్షణ న్యాయం అందించారు. మరి ఇప్పడు ఆయన ఆర్టీసీ ఎండీగా కొత్త బాధ్యతలు తీసుకున్నారు. మరి ఆర్టీసీ విషయంలో ఆయన తక్షణ న్యాయం అందించగలుగుతారా.. ఇక ఆర్టీసీ విషయానికి వస్తే.. ఇది సామాన్యుడి రథం. బడుగు జీవికి అండగా నిలిచే సర్కారు వాహనం.. లాభాలు వచ్చినా రాకున్నా.. చౌకైన ధరకు రవాణా అందించడంలో ఆర్టీసీని మించింది లేదు. దశాబ్దాల తరబడి ప్రజలకు సేవలందిస్తున్న సంస్థ.


అయితే ఆర్టీసీ సంస్థపై అనేక అభాండాలు ఉన్నాయి. ఎప్పుడూ నష్టాల్లో ఉంటుందని.. సర్కారుకు గుదిబండగా మారిందని కథనాలు వస్తుంటాయి. కానీ.. ఆ నష్టాలు ఎందుకొస్తాయి.. పేదవాడికి రాయితీ ప్రయాణం కల్పించినందుకు వస్తాయి.. ఉద్యోగులకు, విద్యార్థులకు రాయితీ ప్రయాణాలు అందించినందుకు వస్తాయి.. ఏ ఇతర సౌకర్యమూ లేని మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యం అందించినందుకు వస్తాయి.. హైదరాబాద్‌ స్థాయిలో ఉన్నత అధికారులు చేసే లంచాల బాగోతాల వల్ల వస్తాయి.


మరి ఇప్పుడు సజ్జనార్‌ చేయాల్సింది ఇదే.. ఆర్టీసీ నష్టాలు వస్తే మార్గాలను ఎన్‌కౌంటర్ చేయాలి.. సర్కారు నుంచి వచ్చే రాయితీలు ఇప్పించాలి.. జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలి.. లంచగొండి ఒప్పందాలను ఎన్‌కౌంటర్‌ చేయాలి. సామాన్యుడి సంస్థకు తక్షణ న్యాయం చేయాలి.. దిశ, యాసిడ్ బాధితులకు జరిగినట్టు తక్షణ న్యాయం జరగాలి.. అలా చేస్తారా..  సజ్జనార్‌ సారూ..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: