తీర్పులు పాతవి.. రాష్ట్రాలు కొత్తవి.. అందుకే జలజగడాలు..

Deekshitha Reddy
కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాలున్న రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఇప్పటివి కావు. దీనిపై గతంలోనే పలుమార్లు వివాదాలు చెలరేగాయి, సద్దుమణిగాయి. అయితే తాజాగా ఏపీ, తెలంగాణ మధ్య చెలరేగిన కృష్ణాజలాల వివాదంతో మరోసారి అంతర్ రాష్ట్ర జలవివాదాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఏపీ, తెలంగాణ మధ్య సమస్యలు ఎందుకొచ్చాయి, దానికి పరిష్కారం ఏంటి..? ఆ పరిష్కారాన్ని ఎవరు చెప్పాలి..? ఈ విషయాలను ఇప్పుడు చూద్దాం.

గోదావరి విషయానికొస్తే..
గోదావరి బేసిన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కర్నాటక, ఏపీ, తెలంగాణ. వీటిలో అప్పడి ఉమ్మడి ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్నాటకల మధ్య వచ్చే జలవివాదాల పరిష్కారానికి 1969లో జస్టిస్ బచావత్ నేతృత్వంలో ఓ ట్రిబ్యునర్ ఏర్పాటు చేశారు. 1980లో ఆ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారం జలాల పంపకాన్ని నిర్ణయించారు.
పోలవరం నిర్మాణంతో కొత్త సమస్యలు..
పోలవరం ప్రాజెక్ట్ కి ఇతర రాష్ట్రాలు తొలుత అభ్యంతరం చెప్పాయి. అయితే 80టీఎంసీల సామర్థ్యంతో పోలవరం నిర్మించుకోడానికి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. ఏపీ 45టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవాలని సూచిస్తూ మిగిలిన 35 టీఎంసీలను కర్నాటక, మహారాష్ట్ర వాడుకోవచ్చని చెప్పింది. విచిత్రం ఏంటంటే.. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ, ఒడిశా, చత్తీస్ ఘడ్ లో ముంపు ప్రాంతాలున్నా.. వాటికి కేటాయింపులు లేకపోవడం. పోలవరం పూర్తయితే ముంపు ప్రాంతాల వివాదం మరింత ముదురుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కృష్ణా సంగతేంటి..?
మహారాష్ట్ర, కర్నాటక, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నీటి పంపిణీకోసం కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్ 1976లో నివేదిక ఇచ్చింది. 2060 టీఎంసీల కృష్ణా నీటిని అత్యథికంగా ఏపీకి 800 టీఎంసీలు, కర్నాటకకు 700 టీఎంసీలు, మహారాష్ట్రకు 560 టీఎంసీలు కేటాయించారు. ఆ తర్వాత 2004లో రెండోసారి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయగా, బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో నివేదిక సమర్పించారు. ప్రధాన జలాలు, అందుబాటులో ఉండే జలాలు అంటూ రెండు కేటగిరీలు చేశారు. ప్రధాన జలాలలో ఏపీకి 1001, కర్నాటకకు 911, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించారు. అందుబాటులో ఉండే జలాలు 65శాతంగా గుర్తించి ఉమ్మడి ఏపీకి 190, కర్నాటకకు 177, మహారాష్ట్రకు 81 టీఎంసీలు కేటాయించారు. ఈ కేటాయింపులతో ఏపీ విభేదిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటషన్ విచారణలో ఉండగానే ఏపీ, తెలంగాణ విడిపోవడం, కొత్త సమస్యలు రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. రెండు రాష్ట్రాల జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎపెక్స్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ చర్చల్లో కృష్ణా జలాలను ఏపీ 66శాతం, తెలంగాణ 34శాతం వాడుకునేలా ఒప్పందం కుదిరింది. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడో మెలిక పెట్టారు. ఈ వాటాలను ఒప్పుకునేది లేదని తెలంగాణకు 50శాతం నీటివాటా కావాలంటున్నారు. ఈ క్రమంలో రాయలసీమ ఎత్తిపోతల వంటి పథకాలను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని వృథాగా సముద్రంపాలు చేస్తోందని ఏపీ మండిపడుతోంది. కృష్ణారివర్ మేనేజ్ మెంట్ బోర్డు దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ప్రభుత్వాలు ససేమిరా అంటున్నాయి. ఈ క్రమంలో నీటి పంచాయతీ కేంద్రానికి చేరినట్టే. చర్చలద్వారా సమస్య సానుకూలంగా పరిష్కారం కావాల్సిందే కానీ,  కోర్టు కేసులతో ఎవరికీ ఉపయోగం ఉండదనేది మాత్రం వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: