జగన్ @ 730 : 30 ఏళ్లు పాలించేలానే ఉందా ?
ఇప్పుడు జగన్ మాట నిజం కావాలంటే.. ఆయన్ను మించి పాలించాలి. 30 ఏళ్లు పాలించాలంటే.. ఆరు సార్లు వరుసగా అధికారం చేజిక్కించుకోవాలి.. మరి అది సాధ్యమేనా.. ఆ దిశగా జగన్ సర్కారు పాలన సాగుతోందా.. అన్నది పరిశీలిస్తే కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్టుగా ఉంది. ప్రధానంగా ప్రజల సంక్షేమం విషయానికి వస్తే.. జగన్ సర్కారు పాలన జనరంజకంగానే సాగిందని చెప్పుకోవాలి. అన్ని వర్గాలకు అవసరమైన పథకాలు ప్రకటించడం.. వాటిని ఠంచనుగా నగదు బదిలీ చేయించడం వంటి విషయాల్లో జగన్ సర్కారుకు మంచి మార్కులే పడతాయి.
అలాగే ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా... ఘోరం జరిగినా జగన్ సర్కారు వెంటనే పరిహారం ప్రకటిస్తుంది. కోటి రూపాయల పరిహారాలకూ జగన్ సర్కారు వెనుకాడదు. ఇలాంటి మానవీయత పాలకుల్లో అరుదు. ఆ విషయంలో జగన్ సర్కారుకు మంచి మార్కులు పడతాయి. అయితే పాలకుడికి ఉండకూడని మరో లక్షణం కక్ష సాధింపు.. కానీ.. ఇది జగన్ కు కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఆయన కొందరు నాయకులను టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి గతంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం కూడా అదే చేసింది. కానీ.. ఇప్పుడు జగన్ సర్కారు కూడా అదే కక్ష సాధింపు చర్యల ద్వారా వచ్చిన మంచి పేరు పొగొట్టుకునే ప్రమాదం కనిపిస్తోంది.
మరో కీలకమైన అంశం అభివృద్ధి. ఏదో ఐదేళ్లు పాలనతో సరిపుచ్చుకునే వారికి సంక్షేమ బాట ఓకే కానీ.. దీర్ఘకాలం అధికారంలో ఉండాలంటే.. అభివృద్ధి కూడా ఉండాలి. లేకపోతే.. ఐదేళ్ల తర్వాత ఇదే స్థాయిలో సంక్షేమం అమలు చేసేందుకు నిధులు ఉండవు. ఆ కోణంలో చూస్తే జగన్ సర్కారుకు అత్తెసరు మార్కులే పడతాయి. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తేనే 30 ఏళ్ల పాలన కల నెరవేరుతుందని జగన్ గుర్తించాలి.