అచ్చెన్నాయుడిపై ఒత్తిడి.. టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు..
అయితే అప్పటికప్పుడు అచ్చెన్నాయుడిపై చర్య తీసుకున్నా లేక, ఆయనే సదరు వ్యాఖ్యలపై స్పందించినా తిరుపతి ఉప ఎన్నికలపై ప్రభావం పడుతుందని అప్పటికి ఆ ఎపిసోడ్ ని తాత్కాలికంగా ముగించారు. తీరా ఇప్పుడు ఫలితాలు వచ్చేశాయి. వైసీపీకి షాకిద్దామనుకున్న టీడీపీ కాస్తా మునుపటి కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని డీలా పడింది. వైసీపీ మెజార్టీ పెరగడంతో ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి కూడా లేదు. రాగా పోగా.. వైసీపీ వారు తమకు తామే పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాలేదని మాత్రమే టీడీపీకి విమర్శించే అవకాశం వచ్చింది.
తిరుపతి ఉప ఎన్నికల తర్వాత, ఫలితాలు వచ్చే వరకు అచ్చెన్నాయుడు ఎక్కడా ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. కొవిడ్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఆస్పత్రుల్లో అందుతున్న సౌకర్యాలపై కూడా ఆయన స్పందించలేదు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై నారా లోకేష్ మాత్రమే స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. చివరకు కోర్టు కేసుల వల్ల ప్రభుత్వం ఇంటర్ పరీక్షల విషయంలో వెనక్కి తగ్గింది. ఒకరకంగా నారా లోకేష్ ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారని చెప్పాలి. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు కూడా ఈ విషయంలో పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. కేవలం తిరుపతి ఎన్నికల ఫలితాల తర్వాతే అచ్చెన్నాయుడు స్వరం పెంచారు. ఆ దిశగా ఆయనపై ఒత్తిడి పెరిగిందని పార్టీ వర్గాలంటున్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్ల సాయంతో విజయం సాధించిందని ఆరోపించిన అచ్చెన్న, ప్రజలు నైతికంగా తెలుగుదేశాన్నే గెలిపించారని చెప్పారు. వైసీపీ దురాగతాలను బయటపెట్టిన తెలుగుదేశం శ్రేణుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు అచ్చెన్నాయుడు. ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్న అచ్చెన్నాయుడిపై చంద్రబాబు ఒత్తిడి తేవడం వల్లే ఆయన వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారని అంటున్నారు. మొత్తమ్మీద తిరుపతి హోటల్ లో సొంత పార్టీపై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సమసిపోలేదనే అర్థమవుతోంది.