హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడినే టీకాలు, ఆక్సిజన్ను హైజాక్ చేస్తున్నాడా ?

Vijaya

కరోనా సెకెండ్ వేవ్ ఉద్రితి కారణంగా నరేంద్రమోడి పై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. కరోనా వైరస్ టీకాలను కేంద్రమే నియంత్రిస్తోంది. రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ నిల్వల నియంత్రణ కూడా కేంద్రం చేతిలోనే ఉన్నాయి. ఫార్మాకంపెనీలు తమ ఉత్పత్తులను నేరుగా కేంద్రానికే అందిస్తున్నాయి. అక్కడినుండే రాష్ట్రాలకు అందుతోంది. అయితే ఈమధ్యనే ఫార్మాకంపెనీలతో రాష్ట్రప్రభుత్వాలు నేరుగా ఆర్డర్లు పెట్టుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఆర్డర్లు పెట్టే వెసులుబాటైతే కల్పించింది కానీ మళ్ళీ నియంత్రణంతా కేంద్రం చేతిలోనే ఉంది. ప్రతి వ్యవహారాన్ని కేంద్రం తనచేతిలోనే పెట్టుకుని బిగించేస్తోంది. పోనీ టీకాలు, ఆక్సిజన్ సిలిండర్లను సరిపడా రోగులకు అందుబాటులో ఉంచిందా అంటే అదీలేదు.



ఇలాంటి అనేక కారణాలతోనే జనాల్లో కేంద్రంపై విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోంది. కేంద్రమంటే నరేంద్రమోడి మాత్రమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. టీకాలను, ఆక్సిజన్ నిల్వలను బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒకలాగ ఇతర పార్టీల ప్రభుత్వాలున్న రాష్ట్రాల విషయంలో మరోలాగ కేంద్రం వ్యవహరిస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. నిజానికి ప్రాణాల విషయంలో తేడాలుండాల్సిన అవసరం లేదు. ఎవరిప్రాణం విలువైనా ఒకటే. కానీ కేంద్రం మాత్రం ప్రాణాలను కూడా విడివిడిగా చూస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్ ఘర్, రాజస్ధాన్, పంజాబ్, జార్ఖండ్ వైద్యశాఖ మంత్రులు మోడిపై ధ్వజమెత్తారు. తమ రాష్ట్రాలకు రావాల్సిన టీకాలను, ఆక్సిజన్ నిల్వలను అందకుండా నరేంద్రమోడి హైజాక్ చేస్తున్నారంటూ మండిపోయారు.



మే 1వ తేదీనుండి 18 ఏళ్ళు నిండినవారికి కూడా టీకాలు వేయించేందుకు అనుమతిచ్చిన కేంద్రం అందుకు తగ్గట్లుగా టీకాలను అందుబాటులో ఉంచాలికదా అంటు నిలదీశారు. ఒకవైపు టీకాలు వేసుకునే వాళ్ళ సంఖ్యను పెంచేసిన కేంద్రం దానికి తగ్గట్లుగా టీకాలను అందుబాటులో ఉంచకపోతే వ్యాక్సినేషన్ ఎలా సాధ్యమంటు గోలపెడుతున్నారు. టీకాలు తయారుచేసే కంపెనీలతో మాట్లాడుకునే వెసులుబాటు ఇచ్చినా కంపెనీలు మాత్రం వ్యాక్సిన్లు అందించే విషయంలో సానుకూలంగా ఉండటంలేదని ఆరోపించారు. ఇప్పటికే కేంద్రం ఇచ్చిన ఆర్డర్లమేరకు ఉత్పత్తి చేయటమే కష్టమని సీరమ్ కంపెనీ యాజమాన్యం చెప్పినట్లు రాజస్ధాన్ ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ చెప్పారు. అంటే ముందుగా ఆర్డర్ ఇచ్చిన కేంద్రానికి ముందుగా సరఫరా చేసిన తర్వాతకానీ రాష్ట్రాలకు సరఫరా చేయలేమని సీరమ్ కంపెనీ తెగేసి చెప్పిందట. ఇక ఆక్సిజన్ నిల్వలను కూడా తమ పాలిత రాష్ట్రాలకే సరఫరా చేయిస్తున్నట్లు మోడిపై ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి మోడిపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: