హెరాల్డ్ ఎడిటోరియల్ : కేంద్రానికి విశాఖ ఉక్కు షాక్ తప్పదా ?

Vijaya
ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనే నిర్ణయంతో విశాఖకు షాకిచ్చిన కేంద్రానికి విశాఖ ఉక్కు కూడా పెద్ద షాకివ్వాలని డిసైడ్ అయినట్లుంది. ఈనెల 7వ తేదీన ఫ్యాక్టరీ మొత్తాన్ని బంద్ చేయాలని ఉద్యోగులు, కార్మికులు డిసైడ్ అయ్యారు. నిజంగానే ఉక్కు ఫ్యాక్టరీ గనుక బంద్ అయితే కేంద్రానికి అంతకుమించిన షాక్ మరొకటి ఉండదనే అనుకోవాలి. ఎందుకంటే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పెరిగిపోతోంది. కేసులే కాదు మరణాలు కూడా బాగా పెరిగిపోతున్న సమయంలో ప్రతి ఆసుపత్రికి ఆక్సిజన్ చాలా అవసరం. ఇప్పటికే దేశంలో ఆక్సిజన్ కొరత వల్ల వేలాది ఆసుపత్రుల్లో ఇబ్బందులు పెరిగిపోతోంది. అందుకనే యావత్ దేశానికి విశాఖ ఉక్కు పరిశ్రమ నుండే ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నారు.



విశాఖ ఉక్కు నుండి రోజుకు సుమారు 100 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తయి  అనేక రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. నిజానికి ఇపుడు ఉత్పత్తవుతున్న మెడికల్ ఆక్సిజన్ కూడా అవసరానికి నూరుశాతం సరిపోవటంలేదు. విచిత్రమేమిటంటే దేశంమొత్తం మీద మెడికల్ ఆక్సిజన్ను ఇంత పెద్దమొత్తంలో ఉత్పత్తి చేస్తున్నది విశాఖ ఉక్కు మాత్రమే. ఇలాంటి పరిశ్రమ ఒక్క గంటపాటు ఉత్పత్తిని నిలిపేసిందంటే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఇంకేమైనా ఉందా ?  సకాలంలో ఆసుపత్రులకు, రోగులకు ఆక్సిజన్ అందకపోతే జరిగే ఉత్పాతాన్ని ఊహించేందుకు కూడా లేదు. ఇన్ని విషయాలు తెలిసికూడా ఉక్కు పరిశ్రమలో ఆక్సిజన్ ఉత్పత్తిని నిలిపేయాలని ఉద్యోగులు, కార్మికులు నిర్ణయించారంటే కేవలం నరేంద్రమోడిపై కడుపుమంటే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సి పనిలేదు.



లాభాల్లో ఉన్న ఉక్కును ప్రైవేటీకరించేందుకు నరేంద్రమోడి సర్కార్ నిర్ణయించటమే విచిత్రంగా ఉంది. పరిశ్రమకు అవసరాలకు తగ్గట్లుగా సొంత గనులను కేంద్రం కేటాయించకపోయినా ఏదోలా నెట్టుకొచ్చేస్తోంది. ఉత్పత్తివ్యయం పెరిగిపోతున్న ప్రైవేటు పరిశ్రమలతో పోటీపడుతోంది విశాఖ ఉక్కు. అన్నీ విషయాలు తెలిసికూడా ఎవరికో లాభం చేకూర్చేందుకు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు మోడి మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటీకరించవద్దని ఉద్యోగులు, కార్మికులు,  ప్రభుత్వం, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు ఎంత మొత్తుకుంటున్నా నరేంద్రమోడి ఏమాత్రం లెక్కచేయలేదు. పైగా ప్రైవేటీకరన ప్రక్రియ మొదలైందనే ప్రకటనలు చేయటం ద్వారా బాగా రెచ్చగొడుతోంది కేంద్రం. ఇలాంటి పరిస్దితుల్లోనే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభించటం, కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపధ్యంలో 7వ తేదీ ఉక్కు పరిశ్రమ బంద్ నిర్ణయం జరిగిందంటే మామూలు విషయం కాదు. మరి బంద్ నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: