ఇపుడిదే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మొత్తం దేశాన్ని వణికించేస్తోంది. రోజుకు లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. పోయిన సంవత్సరం మార్చి నెలలో వెలుగు చూసిన వైరస్ కన్నా సెకెండ్ వేవ్ దేశాన్ని ఎన్నోరెట్లు వణికించేస్తోంది. జెట్ స్పీడుతో దేశమంతా వ్యాపించేస్తోంది. ఇలాంటి నేపధ్యంలోనే రోజుకు వేలాదిమంది కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. ఇదేసమయంలో కరోనా టీకాలు వేయించుకునేందుకు జనాలు ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఒక్కసారిగా లక్షలాది మంది టీకాల కోసం క్యూలైన్లలో నిలబడుతుండటంతో వ్యాక్సిన్లకు కొరత వచ్చేసింది.
18 ఏళ్ళు నిండిన వారికి కూడా వ్యాక్సిన్లు వేసుకోవటానికి అనుమతించి కేంద్రం అందుకు అవసరమైన వ్యాక్సిన్లను సేకరించుకునే బాధ్యతను రాష్ట్రాలపైన మోపేసి తన బాధ్యతనుండి తప్పుకున్నది. పైగా 18 ఏళ్ళు నిండిన వారు వేసుకునే టీకాకు డబ్బులు వసూలు చేయాలని స్పష్టం చేసింది. పనిలోపనిగా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్ధల నుండి రాష్ట్రప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్లను కొనుక్కోవచ్చనే వెసులుబాటు కూడా ఇచ్చింది. ఇప్పటివరకు 60, 45 ఏళ్ళపైబడిన వారు వేసుకునే టీకాలను కేంద్రం ఉచితంగానే సరఫరా చేసింది. అయితే 18 ఏళ్ళు పైబడిన వారు వేయించుకోవాలని అనుకుంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే. సరిగ్గా ఇక్కడే అసలైన సమస్య మొదలైంది.
ఆ సమస్య ఏమిటంటే కోవీషీల్డ్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ కంపెనీ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దానిప్రకారం సదరు కంపెనీ వ్యాక్సిన్ కేంద్రానికైతే రు. 150 అట. రాష్ట్రాలకైతే రు. 400. ప్రైవేటు ఆసుపత్రులకైతే 600 రూపాయలట. ప్రైవేటు ఆసుపత్రులు రు. 600కే వ్యాక్సిన్ అందిస్తాయా ? సీరమ్ అందించే కోవీషీల్డ్ ధరలో మూడు రకాలెందుకు అన్నదే అర్ధం కావటంలేదు. కేంద్రానికి అందించిన 150 రూపాయలకే రాష్ట్రప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అందించచ్చుకదా. లేదా రాష్ట్రాలు తమ ఇండెంట్ ను కేంద్రానికి పంపితే దాని ప్రకారం నేరుగా సీరమ్ కంపెనీ నుండి రాష్ట్రాలకు ఉచితంగా కూడా వ్యాక్సిన్ను సరఫరా చేయచ్చు కదా. వ్యాక్సిన్ కోసం బడ్జెట్లో కేంద్రం కేటాయించినట్లు చెప్పిన రు. 35 వేల కోట్లు ఏమైంది ? ఇప్పటికే అస్సాం ప్రభుత్వం 18 ఏళ్ళు నిండిన వారందరికీ వ్యాక్సిన్లను ఉచితంగా వేయాలని నిర్ణయించింది. మరి అదే నిర్ణయాన్ని కేంద్రంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయచ్చుకదా ? మూడు రకాల ధరలు పెట్టి మళ్ళీ ఇదేం కొత్త తరహా దోపిడియో అర్ధం కావటంలేదు.