హెరాల్డ్ ఎడిటోరియల్ : రైతుసంఘాలు తప్పులు చేస్తున్నాయా ?

Vijaya
అవును సుప్రింకోర్టు నియమించిన నలుగురు సభ్యులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రైతుసంఘాలు తప్పులు చేస్తున్నాయి. కేంద్రం అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను సుప్రింకోర్టు స్టే ఇవ్వటమే చాలా గొప్ప విషయమన్న సంగతిని రైతుసంఘాలు మరచిపోయాయి. వ్యవసాయ చట్టాల అములులో స్టే ఇవ్వటంతో పాటు ఇటు రైతుసంఘాలు అటు కేంద్రప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సుప్రింకోర్టు నలుగురు వ్యవసాయ రంగంలోని నిపుణులతో కమిటి వేసిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే సుప్రింకోర్టు కమిటిని వేసిందో అప్పటి నుండి రైతుసంఘాల్లోని కీలకనేతలు సభ్యుల గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కమిటితో తాము చర్చలు జరిపేది లేదుపొమ్మన్నారు. ఎందుకంటే కమిటి సభ్యులు గతంలో కొత్త వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా వ్యాసాలు రాశారట.




ఇక్కడ రైతుసంఘాలు మరచిపోయిన విషయం ఏమిటంటే వ్యవసాయచట్టాలకు అనుకూలంగా ఉన్నారనే కారణంతో రైతుసంఘాలు కమిటిలోని సభ్యులతో మాట్లాడేది లేదని చెప్పారు. మరి ఇదే సందర్భంగా కమిటిలోని సభ్యుల్లో ఎవరైనా వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ఉండేవారుంటే వారితో తాము మాట్లాడేది లేదని కేంద్ర ప్రతినిధులంటే ?  ప్రతి సభ్యునికి వ్యవసాయచట్టాలకు అనుకూలంగానో లేకపోతే వ్యతిరేకంగానో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. కేంద్రం రూపొందించిన కొత్త వ్యవసాయచట్టాలకు సానుకూలంగా ఉన్నంత మాత్రాన వాళ్ళంతా వ్యవసాయరంగానికో లేకపోతే రైతాంగానికో వ్యతిరేకం కాదని రైతుసంఘాలు గ్రహించాలి. పైగా సుప్రింకోర్టు నియమించిన కమిటి కేవలం సంప్రదింపులు మాత్రమే జరుపుతుంది.




సుప్రింకోర్టు నియమించిన కమిటి రెండుపక్షాలతోను చర్చలు జరిపి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటుంది. తర్వాత తన నివేదికను తయారుచేసి సుప్రింకోర్టుకు అందిస్తుంది. ఇంతకుమించి కమిటి చేయబోయేది కూడా ఏమీలేదు. మరి ఇంతమాత్రందానికే కమిటితో తాము చర్చలు జరిపేది లేదని చెప్పటమంటే రైతుసంఘాలు సుప్రింకోర్టుకు ఏమి మర్యాద ఇస్తున్నట్లు ? రైతుసంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని కేంద్రం ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఇఫ్పటికే అందరికీ అర్ధమైపోయింది. ఇఫ్పటికి 10 సార్లు కేంద్రమంత్రులతో రైతుసంఘాలు సమావేశమైనా పరిష్కారం తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే వ్యవసాయ చట్టాలను రద్దు చేసేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎప్పుడో చెప్పేశారు. ఇటువంటి దశలో సుప్రింకోర్టు కలగజేసుకుని చట్టాల అమలుకు స్టే ఇచ్చిన విషయాన్ని రైతుసంఘాలు మరచిపోకూడదు. కాబట్టి కమిటితో రైతుసంఘాలు చర్చలు జరిపి తమ అభిప్రాయాలను చెప్పటంతో తప్పేమీలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: