ఆ రెండు తీర్పులే.. జగన్ పోరుకు బలాన్నిస్తున్నాయా..?
స్వతంత్ర్య న్యాయవ్యవస్థపై అభాండాలు వేయడం సరికాదంటూ అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావాలి. కానీ.. ప్రస్తుతం అలా ఏకపక్షంగా జగన్ రాసిన లేఖపై వ్యతిరేకత కనిపించడం లేదు. సహజంగానే కొన్ని న్యాయవాదుల సంఘాలు, న్యాయమూర్తుల సంఘాలు జగన్ లేఖను ఖండిస్తాయి. కానీ.. జాతీయ మీడియాలో సైతం ఏకపక్షంగా జగన్ లేఖపై విమర్శలు రావడం లేదు. రెండు వైపులా ఉన్న తప్పులను సమీక్షిస్తూ ప్రముఖ పత్రికలు వ్యాసాలు రాస్తున్నాయి.
మరి ఇలా స్పందన రావడానికి కారణం ఏంటి.. న్యాయమూర్తులపై సానుభూతి రాకపోవడానికి కారణం ఏంటి.. అని పరిశీలిస్తే ప్రధానంగా ఇటీవల ఏపీ హైకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు ఇందుకు కారణం అని చెప్పక తప్పదు.. అవేంటంటే.. అమరావతిలో భూ కుంభ కోణం జరిగిందంటూ సిట్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశిస్తే.. అసలు ఆ సిట్ చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతే కాదు.. అసలు అమరావతి భూములపై విచారణను పూర్తిగా ఆపేసింది.
దీనికి తోడు.. తన పరువుకు నష్టం కలుగుతున్నదంటూ ఏపీ మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయిస్తే.. ఆయన పిటిషన్ పెట్టుకున్న వెంటనే.. ఏపీ హైకోర్టు ఆయనకు అనుకూలంగా స్పందించింది. ఆయన ఎఫ్ఐఆర్ కు సంబంధంచి ఎలాంటి వార్తలూ రాయకూడదంటూ ఆర్డర్ పాస్ చేసింది. దీన్నే గ్యాగ్ ఆర్డర్ అంటారు. ఇది చాలా వివాదాస్పదం అయ్యింది. ఎఫ్ఐఆర్ లో ఉన్న విషయాలు కూడా పత్రికల్లో రాయకూడదనడం ఏంటి అంటూ ఏకంగా సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వంటి వారు కూడా ఈ తీర్పును తప్పుబట్టారు. జగన్ సీఎం అయ్యాక ఎన్నో తీర్పులు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా.. ప్రత్యేకించి ఈ రెండు తీర్పుల కారణంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సానుభూతి రావడం లేదని ప్రముఖ విశ్లేషకులు భావిస్తున్నారు.