హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు ఢిల్లీలో ఎందుకు అడుగుపెట్టడం లేదు ?
నిజానికి గడచిన ఏడాదిన్నరలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం కూడా రాలేదనే చెప్పాలి. ఎందుకంటే జాతీయస్ధాయి నేతలంతా చంద్రబాబుకు దూరమైపోయారు. దూరమైపోయారనేకన్నా కావాలనే అందరు చంద్రబాబును దూరం పెట్టేస్తున్నారన్నది కరెక్టు. ఎందుకంటే ఏ ఒక్క జాతీయస్ధాయి నేతతో కూడా చంద్రబాబుకు సక్రమమైన సంబంధం లేదు. అవతల ఎంత పెద్ద నేతైనా కావచ్చు అవసరం అనుకుంటే వాడుకోవటం అవసరం తీరిపోయిన తర్వాత తీసి అవతల పడేయటమే చంద్రబాబుకు తెలిసిన విద్య. ఈ పద్దతి జరిగినంతకాలం జరిగింది. ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడో అప్పటి నుండే చంద్రబాబు వ్యూహాలన్నీ ఎదురుతిరిగటం మొదలుపెట్టాయి. దాంతో ఎవరు కూడా చంద్రబాబు వైపు చూడటం లేదిపుడు.
అధికారంలో ఉన్నంత కాలం ఏదో అవసరాలుంటాయి కాబట్టి చంద్రబాబు పిలిస్తే పలికేవారు. కానీ అవసరం తీరిపోయిన తర్వాత కరివేపాకులాగ వాడుకుని వదిలేస్తాడని ముద్ర పడిన తర్వాత ఇక ఇపుడు ఎవరు పట్టించుకుంటారు ? ఆమధ్య జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపోయాడు. అవసరమున్నపుడు వాడుకుని తర్వాత వదిలేసి నైజం చంద్రబాబుది అంటూ ధ్వజమెత్తాడు. మొన్నటి ఎన్నికల్లో ఒమర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాతో రాష్ట్రంలో టీడీపీకి ప్రచారం చేయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. తర్వాత జరిగిన పరిణామాల్లో కొందరు మాజీ ముఖ్యమంత్రులు, కీలక నేతలను కేంద్రప్రభుత్వం కాశ్మీర్ లోనే హౌస్ అరెస్టులో ఉంచింది. హౌస్ అరెస్టయిన వారిలో ఫరూఖ్ ఉన్న విషయం తెలిసినా చంద్రబాబు నోరిప్పలేదని ఒమర్ కు మంట.