శభాష్ కేసీఆర్.. అపూర్వ విజయం సాధించిన తెలంగాణ.. ఇది కదా కావాల్సింది..!

ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతగా కొట్లాడాడో అందరికీ తెలిసిందే. తెలంగాణ అనే రాష్ట్రం ఉనికిలో ఉందంటే అందుకు కారణం కేసీఆర్ అని చెప్పకతప్పదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అయినా ఇవ్వకతప్పని పరిస్థితి తెచ్చింది మాత్రం కేసీఆరే అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కే పట్టం కట్టారు. అయితే ఉద్యమ సమయంలో తరచూ కేసీఆర్ మూడు అంశాలు చెప్పేవారు.. నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో మొదటి దానిపై ఆయన అధికారంలోకి వచ్చిన తొలి ఐదేళ్లలోనే దృష్టి పెట్టారు.

తెలంగాణ పల్లెలకు తాగునీటి కష్టం ఉండకూడదని మిషన్ భగీరథ ప్రాజెక్టు చేపట్టారు. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. గతంలో తెలంగాణలో ఉండే కష్టాల జాబితాలో ప్రముఖంగా కనిపించేది నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు. కాళ్లు చేతులు ఒంకర్లు తిరిగిపోయిన ఫ్లోరైడ్ బాధితులను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ ఫ్లోరైడ్ బాధితులు కూడా చురుకుగా పాల్గొన్నారు. చివరకు తెలంగాణ వచ్చింది. కేసీఆర్ సీఎం అయ్యారు.

తెలంగాణ ఏర్పడిన ఆరేళ్ల తర్వాత.. ఆ రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా నిలిచింది. ఫ్లోరైడ్ భూతం నుంచి తెలంగాణ రాష్ట్రం  పూర్తి విముక్తి పొందినట్లు ఏకంగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి సహాయ మంత్రి రతన్ లాల్  కటారియా లోక్ సభలో ఓ ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి 967 ప్రభావిత ప్రాంతాలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య సున్నాకు చేరింది. ఇది తెలంగాణ సర్కారు సాధించిన ఘన విజయంగా చెప్పుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఫ్లోరైడ్  రహిత రాష్ట్రంగా ప్రకటించడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్  హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. కేసీఆర్  ముందు చూపు  కేటీఆర్  కృషే ఈ ఘనతకు కారణమని తెలంగాణ  పంచాయతీరాజ్  శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మిషన్  భగీరథతో తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు మారిపోయాయని, ప్రతి ఇంటికి మిషన్  భగీరథ ద్వారా మంచినీరు అందిస్తున్నామని ఎర్రబెల్లి ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: