హెరాల్డ్ ఎడిటోరియల్ : వైసిపి ఓటమి ఖాయమా ?... కుర్చీపై చంద్రబాబుకు ఎంతాశ ?

Vijaya
ఎంతసేపు అధికారం మీద యావ తప్ప జనాల గురించో లేకపోతే పార్టీని పటిష్టం చేసే విషయం గురించో ఫార్టీ ఇయర్స్ చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నట్లు లేదు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ అనేక అంశాలపై మాట్లాడిన చంద్రబాబు ’జమిలి ఎన్నికలొస్తే వైసిపి పనై పోతుంది ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, మనదే అధికారం’ అంటూ పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు ఇచ్చిన పిలుపు ఎలాగుందంటే అర్జంటుగా ఎన్నికలు వచ్చేయాలని, వైసిపి ఓడిపోయి తాను ముఖ్యమంత్రయిపోదామనే ఆతృతే ఎక్కువగా కనబడుతోంది. షెడ్యూల్ ప్రకారం జరిగిన ఎన్నికల్లో 2019లో తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నది వాస్తవం. కాబట్టి తాను అధికారంలోకి రావాలంటే షెడ్యూల్ ప్రకారం మళ్ళీ 2024 వరకు వెయిట్ చేయక తప్పదు. వాస్తవం ఇదైతే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని దిగిపోవాలని, మళ్ళీ తాను సిఎం అయిపోవాలనే గోల తప్ప చంద్రబాబుకు మరో ధ్యాస ఉన్నట్లు లేదు.





చంద్రబాబు ఆశంతా జమిలి లేదా ఎర్లీ ఎన్నికలపైనే పెట్టుకున్నాడు. అసలు జమిలి ఎన్నికలు కానీ లేదా ఎర్లీ ఎన్నికలు కానీ ఎందుకు వస్తాయని చంద్రబాబు అనుకుంటున్నాడో ఎవరికీ అర్ధం కావటం లేదు. జమిలి ఎన్నికలు జరపాలని ఒకపుడు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆసక్తి చూపించింది వాస్తవం. ఇందులో భాగంగానే అప్పట్లో కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా అన్నీ రాజకీయ పార్టీలతో సమావేశాలు పెట్టింది. ఆ సమావేశంలో దాదాపు అన్నీ పార్టీలు జమిలి ఎన్నికల నిర్వహణను వ్యతిరేకించాయి. స్వయంగా బిజెపి పార్టీ కూడా వ్యతిరేకించింది. దాంతో ఆ ప్రతిపాదన కోల్డు స్టోరేజీలో పడిపోయింది. కాబట్టి జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలు దాదాపు లేదన్న విషయం తేలిపోయింది.





ఇక ఎర్లీ పోల్స్ అని చంద్రబాబు ఎందుకంటున్నాడో అర్ధం కావటం లేదు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎర్లీ పోల్స్ వచ్చే సూచనలేమీ కనబడటం లేదు. కోర్టుల్లో విచారణ జరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని జగన్ కు బెయిల్ రద్దవుతుందని చంద్రబాబు చాలా ఆశతో ఉన్నట్లున్నాడు. ఒకవేళ బెయిల్ రద్దయి జగన్ మళ్ళీ జైలుకు వెళ్ళినా ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడా ఏమీ కనబడటం లేదు. ఎందుకంటే జగన్ భార్య భారతిరెడ్డి కానీ లేకపోతే మరోకరో సిఎం అవుతారు కానీ ప్రభుత్వం ఎందుకు కూలిపోతుంది ? ఎందుకు ఎర్లీ పోల్స్ వస్తాయి ? ఒకవేళ చంద్రబాబు ఆశిస్తున్నదే జరిగితే ఇపుడున్న 23 అసెంబ్లీ సీట్లు కూడా వస్తాయా ? అనేది డౌటే. ఆ విషయాన్ని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు లేదు.





చంద్రబాబు కోరుకుంటున్నట్లు ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా జనాలు టిడిపిని ఎందుకు ఎన్నుకుంటారు ? అనే విషయంలో  ఎల్లోబ్యాచ్ సమాధానం చెప్పగలదా ?  ప్రజా వ్యతిరేకపాలనతో విసిగిపోయే కదా టిడిపిని  జనాలు ఘోరంగా ఓడించింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎల్లోబ్యాచ్ ప్రచారం చేస్తున్నట్లుగా జగన్ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నట్లు కనబడటం లేదు. పైగా సంక్షేమ కార్యక్రమాలను విపరీతంగా అమలు చేస్తున్నాడు. మామూలుగా ఏ ముఖ్యమంత్రి కూడా తన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ లాగ అమల్లోకి తెచ్చింది లేదు. ఇదే సమయంలో ప్రతిపక్షంగా టిడిపి ఏమన్నా ఊడబొడిచేసిందా అంటే అదీలేదు. మరి టిడిపికి ఎందుకు అధికారం కట్టబెట్టాలో చంద్రబాబు కూడా చెప్పలేకపోతున్నాడు. కాబట్టి నిజంగానే మధ్యంతర ఎన్నికలొస్తే టిడిపికి ఇపుడున్న సీట్లు కూడా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది.





కోర్టులో కేసుల విచారణ, బెయిల్ రద్దు లాంటి హఠాత్ పరిణామాలు ఏమైనా జరుగుతాయో అన్న అనుమానంతోనే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ సంక్షేమ జపం చేస్తున్నాడు. గడచిన ఏడాదిన్నరగా అభివృద్ది కార్యక్రమాలకన్నా సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టి జనాల హ్రుదయాల్లో మంచి స్ధానం సంపాదించుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నాడు. జగన్ ఆలోచన గనుక సక్సెస్ అయితే జరగరానిది జరిగినా పార్టీ భవిష్యత్తుకు వచ్చే ఇబ్బందేముండదు. చంద్రబాబు ఆశిస్తున్నట్లు ఏ పద్దతిలో ఎన్నికలు వచ్చినా జరిగే నష్టం తనకే కానీ జగన్ కు కాదన్న విషయం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆలోచిస్తున్నట్లు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: