వార్నీ.. కరోనా వైద్యం ఎంత చౌకో చూడండి.. ?
అయితే వాస్తవానికి కరోనాకు అసలు అంత ఖర్చేమీ కాదట. కరోనా చికిత్స ఎంత చీపో తెలుసా.. ఆక్సిజన్, మందులన్నీ కలిపితే కూడా పది వేల రూపాయలకు మించి కాదట. ఈ విషయం చెబుతున్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. కరోనా చికిత్స ఖరీదైనది కాదని, ఆక్సిజన్, మందులన్నీ కలిపితే కూడా రూ.పదివేలకు మించి కాదని మంత్రి ఈటల రాజేందర్ కుండ బద్దలు కొట్టేశారు.
రోజుకు లక్ష, రెండు లక్షలు ఖర్చు అయ్యే చికిత్స అసలు కరోనాకు లేనే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఏదైనా ఆసుపత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి.. అడ్డగోలుగా వసూళ్లు చేస్తే చర్యలు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు.. కరోనాకు ప్రభుత్వ వైద్యంపై ఆధారపడాలని ఆయన సూచించారు. అన్ని జిల్లాల్లో ఐసీయూ, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇక హైదరాబాద్ నగరంలో అందుతున్న వైద్య సేవలను ఈటల రాజేందర్ వివరించారు. హైదరాబాద్ నగరంలోని చెస్ట్, ఫీవర్ ఆసుపత్రి, కింగ్ కోఠి ఆసుపత్రిలో కావాల్సినన్ని బెడ్లు ఉన్నాయని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఈటల వెల్లడించారు. టిమ్స్, సరోజిని కంటి ఆసుపత్రి, కింగ్ కోఠి, ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రిల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. కరోనా రోగికి మందుల కంటే ఆక్సిజన్ ముఖ్యమని, ఈ నెల పదితేదీలోపు లిక్విడ్ ఆక్సిజన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.