హెరాల్డ్ ఎడిటోరియల్ : ’టార్గెట్ టిడిపి’ అని చెప్పిన ఎల్లోమీడియా...నేతల్లో సంచలనం
అవును మీరు చదివింది నిజమే. టార్గెట్ టిడిపి అంటూ ఎల్లోమీడియాలో పెద్ద కథనమే వచ్చింది. అందులో వచ్చిన అంశాల పట్ల టిడిపి నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. నిజానికి కథనంలో టచ్ చేసిన అంశాలేవీ కొత్తవి కాదు. కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్షునిగా నియమించినపుడే బిజెపి అగ్రనాయకత్వం తన అజెండాను చాలా స్పష్టంగా చెప్పిందట. టార్గెట్ టిడిపి అన్న విషయం అప్పుడే ఢిల్లీ నాయకత్వం సెట్ చేసింది. కాకపోతే తనకిచ్చిన అజెండాను పక్కనపెట్టి కన్నా సొంత అజెండాను అమలు చేశాడు. ఇదే విషయమై జాతీయ నాయకత్వం కన్నాను హెచ్చరించినా కన్నా లెక్క చేయలేదట. దాంతో వేరే దారిలేక చివరకు కన్నాను అధ్యక్షపదవి నుండి అర్ధాంతరంగా తీసేసింది. నిజానికి ఎల్లోమీడియాలో వచ్చిన టార్గెట్ టిడిపి అన్నది కొత్త అజెండా ఏమీ కాదన్న విషయం అందరికీ తెలిసిందే.
కన్నా కూడా చంద్రబాబునాయుడు అండ్ కో కు మొదటి నుండి పూర్తి వ్యతిరేకమే. కాకపోతే అధ్యక్షుడు అయిన తర్వాత టిడిపి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీన్ మారింది. టిడిపి నుండి బిజెపిలోకి రాజ్య సభ ఎంపిల ఫిరాయించిన తర్వాతే కన్నా మైండ్ సెట్ లో మార్పొచ్చినట్లు కమలనాధులు చెబుతున్నారు. కన్నా మైండ్ సెట్ మార్పుకు ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరే కారణమని వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. చంద్రబాబు దగ్గర కోట్ల రూపాయలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ విజయసాయితో పాటు చాలామంది వైసిపి నేతలు ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. వాటినే తాజాగా ఎల్లోమీడియా తన కథనంలో చెప్పిందంతే.
బిజెపి అగ్రనేతల్లో ఉన్న భావన ఏమిటంటే బిజెపికి ప్రధాన శతృవు తెలుగుదేశంపార్టీనే కానీ వైసిపి ఎంతమాత్రం కాదు. పార్టీల పరంగా వైసిపి-బిజెపి మధ్య ఎప్పుడూ గొడవల్లేవు. కలిసినా, విడిపోయినా మోడిని వ్యక్తిగతంగా తిట్టినా, పొగిడినా చంద్రబాబు తరపునే అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల మధ్య కూడా ఎప్పుడు సమస్యలు కూడా తలెత్తలేదు. రెండు ప్రభుత్వాలు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే కంటిన్యు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మొన్నటి ఎన్నికల్లో వైసిపి చేతిలో చావుదెబ్బలు తిన్న టిడిపినే టార్గెట్ చేయాలని బిజెపి అగ్రనాయకులు స్పష్టంగా కన్నాతో పాటు ఇతర బిజెపి నేతలకు కూడా చెప్పారని సమాచారం. టిడిపిని దెబ్బతీయటం ద్వారా రాష్ట్రంలో బిజెపి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలనే ఆలోచనతో ఢిల్లీ నాయకత్వం ప్లాన్ చేసింది.
అయితే కేంద్ర నాయకత్వం ప్లాన్ కు కన్నా వ్యతిరేకంగా రాజకీయం నడిపాడు. బలహీనపడిపోయిన టిడిపిని దెబ్బ కొట్టాలని అగ్ర నాయకత్వం చెబితే కన్నాయేమో బలంగా ఉన్న అధికార వైసిపిని టార్గెట్ చేయటం మొదలుపెట్టాడు. అంటే పరోక్షంగా కన్నా వేసిన ప్రతి అడుగు చంద్రబాబును బలోపేతం చేయటానికే అని ఢిల్లీ నాయకత్వం నిర్ణయానికి వచ్చేసింది. అందుకనే ఇక లాభం లేదని చెప్పా పెట్టకుండానే కన్నాను అర్ధాంతరంగా మార్చేసింది. సరే కన్నాను మార్చి సోమువీర్రాజును పెట్టారు బాగానే ఉంది. మరి ఇపుడైనా బిజెపి అజెండా అమలవుతుందా ?