హెరాల్డ్ ఎడిటోరియల్ :  కన్నా చేసిన ఆ  తప్పుల వల్లే వేటు పడిందా ? బకరాలైంది ఎవరో తెలుసా ?

Vijaya
అర్ధాంతరంగా కన్నాలక్ష్మీనారాయణ అధ్యక్షపదవి నుండి తప్పుకోవాల్సి రావటం స్వయం కృతమనే అనిపిస్తోంది. బిజెపి అగ్ర నాయకత్వం మనసును తెలుసుకోకుండా పూర్తి వ్యతిరేకంగా నడుచుకోవటంతోనే అధ్యక్షపదవిని వదులుకోవాల్సొచ్చిందని పార్టీ నేతలే చెబుతున్నారు. మొత్తం మీద కన్నా మూడు తప్పులు చేశాడంటున్నారు నేతలు. ఇంతకీ ఆ తప్పులు ఏమిటయ్యా అంటే మొదటిది : మొన్నటి ఎన్నికల్లో ఎంపిగా పోటి చేయటం. రెండో తప్పేంటంటే చంద్రబాబునాయుడుతో అంటకాగటం, మూడో తప్పు ఏమిటంటే జగన్మోహన్ రెడ్డిని పూర్తిస్ధాయిలో వ్యతిరేకించటం. ఈ మూడు విషయాల్లో కూడా కన్నా అగ్రనాయకత్వం మనసులో ఏముందో తెలుసుకోకుండానో లేకపోతే తెలిసి కూడా సొంత అజెండాతో వ్యవహరించటమే కొంప ముంచేసింది.

నిజానికి బిజెపి అగ్ర నాయకత్వానికి ప్రధమ శతృవు చంద్రబాబే కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతమాత్రం కాదన్న విషయం ఎవరినడిగినా చెబుతారు. ఎంతో అనుభవం ఉన్న కాన్నాకు ప్రత్యేకంగా ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు.  అలాంటిది వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి  చంద్రబాబును వదిలిపెట్టేసి జగన్ పైనే కన్నా తన బాణాలు వేయటం మొదలుపెట్టాడు. అసలు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు ? అనే అనుమానాలు వచ్చేట్లుగా కన్నా వ్యవహరించాడు. తెలుగుదేశంపార్టీని రూపుమాపి ఆ స్ధానంలో బిజెపి కుదురుకోవాలన్న ఆలోచనను కన్నా పూర్తిగా దెబ్బ తీశాడు. మొన్నటి ఎన్నికలో జగన్ దెబ్బకు చంద్రబాబు పూర్తిగా కుదేలైపోయాడు. అలాంటి చంద్రబాబును రాజకీయంగా మరింత ఇరుకునపెట్టడం ద్వారా బిజెపి ఇమేజిని పెంచుకోవాలని జాతీయ నాయకత్వం భావించింది.

అయితే కన్నా మాత్రం విరుద్ధంగా చంద్రబాబుకు మద్దతుగా జగన్ను వ్యతిరేకించటం మొదలుపెట్టాడు. దాంతో  చంద్రబాబు కనుసన్నల్లోనే బిజెపి నడుచుకుంటోంది అనే భావన జనాల్లో  పెరిగిపోయింది. పార్టీల పరంగా తీసుకున్నా వైసిపి-బిజెపి మధ్య గొడవలేమీ లేవు. పైగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. రాజ్యసభలో మోడి సర్కార్ కు జగన్ సంపూర్ణ మద్దతిస్తున్నాడు. కాబట్టి ఏరకంగా చూసుకున్నా కన్నా అసలు జగన్ను టార్గెట్ చేయకూడదు. కానీ కన్నా జగన్ను వ్యతరేకించటం  అగ్రనాయకత్వానికి  నచ్చలేదు. అసలు మొన్నటి ఎన్నికల్లో కన్నా పోటి చేయటమే పెద్ద తప్పంటున్నారు. నరసరావుపేట ఎంపిగా పోటి చేసిన కన్నాకు వచ్చింది 15,700 ఓట్లు. అప్పటి వరకు కన్నాకు కాపుల్లోను, జిల్లాలోను మంచి పట్టుందని ఢిల్లీ నాయకత్వం అనుకున్నది. పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఓట్లు చూసిన తర్వాత కన్నా సత్తా ఏంటో నాయకత్వానికి అర్ధమైపోయిందట.

ఇక్కడ కన్నా మరచిపోయిన మరో విషయం ఏమిటంటే సామాజికవర్గ సమీకరణలు. రెడ్లలో మెజారిటి వర్గం వైసిపిలో ఉంది. కమ్మోళ్ళల్లో మెజారిటి టిడిపిలో ఉన్నారు. మరి మిగిలిన బిసిలు, కాపులు ఏ పార్టీలో ఉన్నారు ? ఏ పార్టీ అంటే ఈ రెండు సామాజికవర్గాలకు ప్రత్యేకించి ఓ పార్టీ అంటు లేదు. ముందుగా కాపులను దగ్గరకు తీసుకోవాలని బిజెపి వ్యూహం పన్నింది. అందుకనే కన్నాకు అధ్యక్షపదవి కట్టబెట్టింది. అయితే కన్నా ఆపని చేయకుండా చంద్రబాబుకు మద్దతుదారుడిగా మారిపోయాడు. అంటే బిజెపి అస్తిత్వాన్నే కన్నా పణంగా పెడుతున్నాడని ఢిల్లీ నాయకత్వానికి అర్ధమైపోయింది. వైసిపి, టిడిపిలకు సమదూరం పాటించాల్సిన కన్నా చంద్రబాబు అజెండాను భుజాన వేసుకోవటమే తప్పు.

ఇదే విషయాన్ని హెచ్చరించినా కన్నా పద్దతి మారలేదట. దాంతో ఇక లాభం లేదనుకుని హఠాత్తుగా కన్నాను అధ్యక్షపదవి నుండి తప్పించేశారు. వెంటనే  కాపు సామాజికవర్గానికే చెందిన ఎంఎల్సీ సోము వీర్రాజునే అధ్యక్షుడిని చేసింది నాయకత్వం. అంటే కన్నా కారణంగా సోము వీర్రాజుకు అజెండా  స్పష్టమైపోయింది. కాబట్టి  సోము బాధ్యతలు తేలికందైనే చెప్పాలి. మరి గాడితప్పిన బిజెపిని వీర్రాజు ఎంత తొందరగా గాడిలో పెడతాడో చూడాల్సిందే. ఈ మొత్తం ఎపిసోడ్ లో బకరా అయ్యింది కన్నా తర్వాత చంద్రబాబు అండ్ కో మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: