మీడియా మంటలు: మీడియా ప్రపంచంలో పెను విషాదం.. ఇంతకంటే ఏముంటుంది...?
ఏ చిన్న సంస్థ అయినా.. తన దగ్గర ఉద్యోగం చేసే వారికి ఆదరువుగా నిలుస్తుంది. ఏ చిన్న కష్టం వచ్చినా.. నేనున్నానంటూ.. ఉద్యోగికి అండగా నిలుస్తుంది. అయితే, అదేం చిత్రమో.. ప్రపంచానికి పాఠాలు చెప్పి.. బుద్ధులు నేర్పించే మీడియాలో మాత్రం అదే ఉద్యోగులు వివక్షకు గురవుతున్నారు. మీ చావు మీరు చావండి! అని సంస్థలు ఉద్యోగులను నడివీధిలో వదిలేస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరు సాచింది. దీని బారిన పడ్డవారు ఎవరూ అతీతులు కారు. అంటే.. చిన్నా పెద్ద, పేద-ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ దీనికి గురై నానా తిప్పలు పడుతున్నారు.
ఈ క్రమంలో కరోనా సమయంలో అందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. అయితే, ఏం జరిగినా.. తనకే ముఖ్యమని భావించే పాత్రికేయులు మాత్రం కరోనా సమయంలోనూ విధులే ప్రధానంగా ముందుకు వస్తున్నారు. కరోనా వార్తలను ప్రజలకు ఎప్పటిక ప్పుడు దేశవ్యాప్తంగా అందిస్తున్నారు. అదేసమయంలో కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించుకునే మార్గాలపైనా కథనా లు వెలువరిస్తున్నారు. ఇదంతా సంస్థలు చేయడం లేదు. కేవలం క్షేత్రస్థాయిలో కరోనా మహమ్మారి ఉందని తెలిసి కూడా విధుల పట్ల శ్రద్ధతో పాత్రికేయులు ప్రాణాలకు తెగించి చేస్తున్న ప్రమాదకర విధులు.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా దాదాపు వంద మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ముంబై సహా ఢిల్లీల్లోనూ పాత్రికే యు లు కరోనా భారిన పడ్డారు. ఈ సమయంలో వారిని ఆదుకునేందుకు కానీ, వారికి సరైన వైద్యం అందించేందుకు కానీ సంస్థలు ముందుకు రావాలి. కానీ, మీడియా ప్రపంచంలో ఇదో పెద్ద పెను విషాదం. మీరు ఎలా పోతే పోండి.. మాకెందుకు అని సంస్థలు చేతులు ఎత్తేశాయి. అదేసమయంలో ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం మానేశాయి. దీంతో జర్నలిస్టుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. అటు పేదలు కాక, ఇటు ధనికులు కాకపోవడంతో జర్నలిస్టులు ఇప్పుడు సాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్తితి ఏర్పడింది. మరి ఎవరు వీరిని ఆదుకుంటారో చూడాలి.!