మళ్లీ ప్రారంభం కానున్న పాడుతా తీయగా..!

Podili Ravindranath
పాడుతా తీయగా... ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ఎంతో మంది గాయకులను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. ఇంకా చెప్పాలంటే... ప్రస్తుతం తెలుగు సినిమాకు గాత్రం అందిస్తున్న వారిలో మెజారిటీ శాతం ఈ ప్లాట్ ఫామ్ నుంచి వచ్చిన వారే. 1996వ సంవత్సరం, జనవరి 12వ తేదీన పాడుతా తీయగా తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. నాటి నుంచి 25 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఈ ఎపిసోడ్ కొనసాగింది. మొత్తం 20 సీజన్ల పాటు ఈ పాటల ఒరవడి సాగింది. రామోజీ గ్రూప్ ప్రొడక్షన్ కంపెనీగా సాగిన ఈ సంగీత ప్రయాణానికి గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వ్యాఖ్యాతగా, న్యాయ నిర్ణేతగా... వ్యవహరించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించి... గాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు ఎస్పీ బాలు. కొత్త వారి తప్పులను తెలియజేస్తూ... వారి పాడిన పాటల నేపథ్యం తెలియజేస్తూ.. ఈ కార్యక్రమాన్ని ఒక రేంజ్‌కు తీసుకువెళ్లారు ఎస్బీబీ.
పాడుతా తీయగా కార్యక్రమాన్ని కాపీ చేస్తూ... మిగిలిన ఛానల్స్ కూడా టాలెంట్ హంట్ చేపట్టినప్పటికీ... అవి అంతగా సక్సెస్ సాధించలేదు. ఏదో ఒకటి, రెండు నెలలు సాగినా... ఆ తర్వాత పాడుతా తీయగా ధాటికి నిలవలేకపోయాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరమపదించిన తర్వాత... పాడుతా తీయగా కార్యక్రమం ఆగిపోయింది. అయితే ఈ సంగీత ప్రయాణాన్ని కొనసాగించాలని ఈటీవీ యాజమాన్యం భావించింది. ఈ బాధ్యతలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌కు అప్పగించారు. ఎస్పీబీ ప్రధమ వర్ధంతి సందర్భంగా ఈటీవీ యాజమాన్యం బాలుకు ప్రేమతో... పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రామోజీ గ్రూప్ ఛైర్మన్.. రామోజీరావు... స్వయంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ వేదికపైనే పాడుతా తీయగా తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి... ఎస్పీ చరణ్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని ప్రకటించారు. పాడుతా తీయగా కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాడిన మైక్‌ను స్వయంగా ఎస్పీ చరణ్‌కు అందించారు రామోజీరావు. త్వరలోనే ఈ టాలెంట్ షో తిరిగి ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: