ఏడాదిన్నర తర్వాత కళకళ

Podili Ravindranath
కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు అన్నీ కూడా మళ్లీ సందడిగా మారాయి. గతేడాది మార్చి 20వ తేదీన మొదలైన లాక్ డౌన్... ఆ తర్వాత అన్ని రంగాలపై పెను ప్రభావం చూపింది. కరోనా వైరస్ భయంతో నలుగురు ఓ చోట కలిసేందుకు కూడా భయపడిపోయారు. ప్రభుత్వాలు కూడా పరిమితులు విధించడంతో ఎలాంటి శుభ కార్యాలు, వేడుకలు లేకుండానే ఏడాది కాలం గడిచిపోయింది. లాక్ డౌన్ కారణంగా కుదేలైన వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే... అన్ని రంగాలపై కూడా కరోనా వైరస్ పెను ప్రభావం చూపింది. ఆ తర్వాత క్రమంగా అన్ లాక్ నిబంధనలు రావడంతో... ఒక్కో రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
అయితే కరోనా వైరస్ వల్ల తీవ్రంగా నష్టపోయిన వ్యాపారాల్లో ఈవెంట్ మేనెజ్ మెంట్ ఒకటి. ఎలాంటి వేడుకలు, సంబరాలు లేకపోవడంతో... చాలా మంది తమ ఉపాధిని కోల్పోయారు. దాదాపు ఏడాదిన్నర కాలంగా చాలామంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కూడా. కల్యా మండపాలు, ఫంక్షన్ హాళ్లు, పూల డెకరేషన్, బ్యాండ్ బాజా, టెంట్ హౌస్ లు, క్యాటరింగ్ తో పాటు పెళ్లి తంతు నిర్వహించే పురోహితులు కూడా పనులు లేక దాదాపు ఖాళీగానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే....తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది ఇతర మార్గాలను కూడా చూసుకున్నారు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది మే నెలలో కూడా కరోనా వైరస్ సెకండ్ వేవ్ పెను ప్రభావం చూపింది. అప్పుడు కూడా ఎలాంటి వేడుకలు జరగలేదు. అయితే ఈ శ్రావణ మాసం నుంచి వరుస ముహుర్తాలు ఉండటంతో.... శుభకార్యాలు జరిపేందుకు అంతా సిద్ధమయ్యారు. ఈ నెల 12వ తేదీ నుంచే ముహుర్తాలు మొదలయ్యాయి. వచ్చే నెల 5 తర్వాత ఓ 15 రోజులు మాత్రమే బ్రేక్. ఆ తర్వాత మళ్లీ దసరా ముహుర్తాలు, కార్తిక మాసంలో పెళ్లిళ్లు జరిపించేందుకు అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నప్పటికీ.... ప్రజలు మాత్రం వేడుక నిర్వహించుకునేందుకు పరిమితులు ఏమిటంటున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండటంతో... వైరస్ కు ప్రజలు భయపడటం లేదు. జీవితంలో ఒక్కసారి జరుపుకునే వేడుకకు పరిమితులు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా... ఏడాదిన్నర తర్వాత... తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: