పవన్.. ఈ సమయంలో ఈ తీర్థయాత్రలేంటో?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. త్వరలో ధర్మపురి క్షేత్రాన్ని సందర్శించి 32 నారసింహ క్షేత్రాల సందర్శన కోసం అనుష్టుప్ నారసింహ యాత్ర చేపట్టబోతున్నారని ఆయన పార్టీ ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న పవన్.. ఈ నెల 24న పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి నరసింహాస్వామి కేత్రాలను సందర్శించనున్నారు. రాజకీయ పర్యటనల కోసం ఇటీవల కొనుగోలు చేసిన వారాహి వాహనానికి కొండగట్టు అంజన్న ఆలయ సన్నిధిలో సంప్రదాయ పూజ జరపాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురయ్యారు. కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందువల్ల ప  తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తారు.

ఇక రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన 'వారాహి' వాహనాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు జనసేనాని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఆ తర్వాత ధర్మపురి క్షేత్రాన్ని సందర్శించి 32 నారసింహ క్షేత్రాల సందర్శన కోసం చేపట్టే అనుష్టుప్ నారసింహ యాత్రకు జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు. అంటే ఆయన 32 నరసింహా ఆలయాలను సందర్శించాల్సి ఉంది. అసలే ఇప్పుడు ఏపీలో ఎన్నికల వేడి వచ్చేసింది.. మరి ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ ఇలా తీర్థయాత్రలను ప్లాన్ చేయడం ఏంటనే ప్రశ్న ఉదయిస్తోంది. అసలే పవన్‌కు సమయం తక్కువ. ఓవైపు సినిమాలు.. మరో వైపు రాజకీయం.. ఇప్పటికే పార్ట్ టైమ్ పొలిటీషియన్ అన్న పేరుంది. మరి పవన్ ఇవన్నీ ఎలా మేనేజ్‌ చేస్తాడో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: