వడ్డీతో సహా కట్టండి.. జగన్‌కు హైకోర్టు షాక్‌?

కరోనా సమయంలో వైద్య సేవలు అందించిన వైద్యులకు ఏపీ ప్రభుత్వం జీతాలు అందించకపోవటంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంపై ప్రభుత్వ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ నెల 9లోగా జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. దానికి స్పందించిన హైకోర్టు జాప్యానికి వడ్డీ సైతం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.

అంతే కాదు.. కొవిడ్‌ సమయంలో సేవలు అందించిన వైద్యులకు జీతం బకాయిలు చెల్లించడంలో జాప్యం చేసినందుకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ జీతాన్ని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఇలా నిలదీయడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. పిటిషనర్లకు జీతం చెల్లించేందుకు రూ.14లక్షలు కృష్ణా జిల్లా డీఎంహెచ్‌వోకు మంజూరు చేశామని ఆరోగ్య,కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌ కోర్టుకు తెలిపారు.

ఆ సొమ్ము ఈనెల 9లోపు పిటిషనర్లకు చెల్లిస్తారని ఆరోగ్య,కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌ కార్యాలయం తరఫున ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది తాండవ యోగేష్‌ వాదనలు వినిపించారు. ఇంతగా జాప్యం జరిగినందుకు వడ్డీ చెల్లించేలా ఆదేశించాలని కోరారు. దీనికి  న్యాయమూర్తి స్పందిస్తూ.. చెల్లింపుల్లో జాప్యం జరిగిన మాట వాస్తవమే కాబట్టి సముచితమైన వడ్డీ చెల్లింపు ఉండాలని చెప్పారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు హైకోర్టు  విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఈ ఏడాది జనవరి 20 నుంచి మార్చి 20 వరకు కొవిడ్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించామని కాంట్రాక్టు వైద్యులు తెలిపారు. అయినా  తమకు జీతం బకాయిలు చెల్లించలేదని పేర్కొన్నారు. మొత్తం 10 మంది కాంట్రాక్టు వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నవంబర్‌ నెల జీతం ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని కూడా వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: