కేసీఆర్‌ను ఆకాశానికెత్తేసిన ఆ పార్టీల నేతలు?

బీఆర్ఎస్‌ ఏర్పాటు చేసిన కేసీఆర్‌పై జేడీఎస్, వీసీకే పార్టీ నేతలు ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ భారత రాష్ట్ర సమితికి కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి, తమిళనాడులో దళిత ఉద్యమ నేతగా పేరున్న వీసీకే పార్టీ అధినేత, ఎంపీ తిరుమావళవన్ మద్దతు ప్రకటించారు. తెరాస పేరు మార్పు కోసం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి ఇద్దరు నేతలు హాజరయ్యారు. దేశ నిర్మాణానికి అవసరమైన విజన్ ఉన్న గొప్ప నేత కేసీఆర్ అని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి అన్నారు.

దళితులు, రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు గొప్ప అంకితభావం ఉందని కుమారస్వామి అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఎంత పోరాటం చేశారో తమకు తెలుసునని న్నారు. కుమారస్వామి అన్నారు. కేసీఆర్ పోరాటం వల్ల ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా వున్నారని.. అదే తరహాలో దేశవ్యాప్తంగా కేసీఆర్ విజయం సాధించాలని కోరుకుంటున్నామని కుమారస్వామి అన్నారు. తెలంగాణ అభివృద్ధి చేయాలన్న కలలను సాకారం చేసుకున్న కేసీఆర్.. ఇప్పుడు దేశాభివృద్దిని సవాలుగా తీసుకున్నారని కుమారస్వామి అన్నారు.

కేసీఆర్ దేశానికి రోల్ మోడల్ అని తమిళనాడులోని వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ గా టీఆర్‌ఎస్‌ మారడం గొప్ప పరిణామమని ఎంపీ తిరుమావళవన్ వర్ణించారు. భారాసకు అద్భుతమైన భవిష్యత్తు ఉందన్నారు. కేసీఆర్ ఆలోచనలు, పనితీరు, పోరాటాలు, విజయాలు, అన్నీ ప్రత్యేకతతో కూడినవని తిరుమావళవన్ అన్నారు. తెలంగాణ ప్రజలకోసం ప్రత్యేక రాష్ట్రాన్నే సాధించిన కేసీఆర్.. ఇప్పుడు దేశ ప్రజలకోసం సాధించేందుకు ముందడుగు వేస్తున్నారని తిరుమావళవన్ అన్నారు.

దళిత బంధు, రైతు బంధు విప్లవాత్మకమైన పథకాలని తిరుమావళవన్  అన్నారు. బీఆర్ఎస్‌ ఏర్పాటు సరైన సమయంలో తెలివైన నిర్ణయమని తిరుమావళవన్  అన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వానికి కృషి చేస్తోందని తిరుమావళవన్ అభినందించారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరున పెట్టడం గొప్ప విషయమన్న వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్.. ఇదే స్పూర్తితో పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: