కేసీఆర్‌కు బండి ఛాలెంజ్‌: తెలంగాణలో మరిన్ని ఉపఎన్నికలు?

తెలంగాణలో త్వరలోనే మునుగోడు ఉపఎన్నిక రాబోతోంది. అయితే.. కేసీఆర్ కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసురుతున్నారు. కేసీఆర్‌కు నైతిక విలువలుంటే ఉప ఎన్నికల్లో కొట్లాడదాం రా అని సవాల్ విసురుతున్నారు. ఒకవేళ ఈ సవాల్ ను కేసీఆర్ స్వీకరిస్తే మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ము, ధైర్యముంటే ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్ లో చేరిన వారందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బండి సంజయ్ ఛాలెంజ్‌ చేశారు.  పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలంటూ టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేయడంపై బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కో లీటర్ పెట్రోలుపై వ్యాట్ పేరుతో రూ.30లు దోచుకుంటున్న టీఆర్ఎస్ నేతలు పెట్రోలు ధరల తగ్గింపుపై ఆందోళన చేయడం సిగ్గు చేటని బండి సంజయ్ అన్నారు.

9వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సిరిపురం నుంచి ప్రారంభమైన పాదయాత్ర రామన్నపేట ప్రాంతంలో సాగింది. పెట్రోలుపై లీటర్ కు రూ.30లు దోచుకుంటూ ధరల పెంపుపై మాట్లాడేందుకు సిగ్గులేదా అని ప్రశ్నించిన బండి సంజయ్.. ఫాంహౌజ్ కు నీళ్ల కోసం లక్ష కోట్లకుపైగా ఖర్చుపెట్టినవ్..ఈ ప్రాంత ప్రాజెక్టుల కోసం రూ.700 కోట్లు ఖర్చుపెట్టలేవా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు.

రాముడి వారసులైతే... బీజేపీకే ఓటేయాలని.. పిలుపు ఇచ్చారు. కేసీఆర్ కి వయసు మీద పడ్డదని..  డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిండని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే జైల్లో పెడతారని... కేసీఆర్ అంటే... ఖాసీం చంద్రశేఖర్ రజ్వి అని బండి సంజయ్ విమర్శించారు.  కేటీఆర్ అంటే సయ్యద్ మక్బుల్ అని మండిపడ్డారు. కేసీఆర్ ఎన్నికలప్పుడు ఇష్టం వచ్చిన హామీలు ఇస్తారని... ఆ తర్వాత వాటిని విస్మరిస్తాడని బండి సంజయ్ అన్నారు. ఈసారి మునుగోడులో బీజేపీకి అవకాశం ఇవ్వాలని బండి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: