ఎంపీలూ.. పబ్లిగ్గా ఇవేం తిట్లు.. కాస్త మారండయ్యా?

రాజకీయాల్లో రాను రాను విలువలు తగ్గిపోతున్నాయనే కామెంట్ ఎప్పటి నుంచో ఉంది. అయితే. ఇప్పుడు విలువల సంగతి పక్కన పెట్టి.. అసలు కనీస మర్యాదలు.. తిట్లు, శాపనార్థాలు కూడా సాధారణ సంభాషణల్లా మారిపోతున్నాయి. తాజాగా.. వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు రఘురామ కృష్ణం రాజు.. విజయ సాయిరెడ్డి సోషల్ మీడియాలో తిట్టుకున్న తిట్లు చూస్తే.. అసలు వీళ్లు ఎంపీలేనా అని సాధారణ ప్రజలు కూడా అనుకోకుండా ఉండలేరు.

విజయ సాయి రెడ్డి.. రఘురామ కృష్ణం రాజును విగ్గు రాజు.. పెగ్గు రాజు అంటూ సంభోదిస్తే.. అందుకు రఘురామ కృష్ణంరాజు  కౌంటర్‌గా నిజాలు తెలుసుకోరా కండోమ్‌ రెడ్డీ అంటూ కౌంటర్ ఇవ్వడం చూస్తే అసలు వీళ్లు ఎంపీలేనా అనిపించక మానదు. ఒక ఎంపీ మరో ఎంపీని అరేయ్‌.. ఒరేయ్.. అని సోషల్ మీడియాలో తిట్టుకోవడం.. గతంలో ఎప్పుడూ చూసి ఉండం.. అంతే కాదు.. నీ మీసాలైనా వరిజినలేనా పీకి అంటించుకున్నవా అంటే.. నా వెంట్రుకలన్నీ చూపిస్తా.. నువ్వే పీకి చూస్కో అంటూ బదులివ్వడం.. చూస్తే వీరిద్దరూ ఎంపీ స్థాయిని దిగజార్చారని చెప్పక తప్పదు.

మన దేశంలో భావ ప్రకటనాస్వేచ్ఛ ఉంది.. కాదనలేం.. ఎవరైనా తమ భావాలు స్వేచ్ఛగా ప్రకటించొచ్చు.. కానీ.. రాజకీయ నాయకులు అందులోనూ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నావారు.. ఈ దేశంలో అమలు కాబోయే చట్టాలను తయారు చేసే నాయకులు ఇంత పబ్లిక్‌గా సోషల్ మీడియాలో బూతులు తిట్టుకోవడం ప్రజలకు రాజకీయ నాయకులపై మరింత అసహ్యం కలిగేలా పరిస్థితి తయారవుతోంది.

వీరేమైనా సామాన్య నాయకులా.. అంటే కాదు..  అందులో ఒకరు ప్రజలతో ఎన్నుకోబడిన లోక్‌సభ ఎంపీ అయితే.. ఇంకొకరు పరోక్షంగా రాజ్యసభ ద్వారా ఎంపీ అయ్యారు. అందులోనూ ఇటీవలే రెండో సారి కూడా ఎంపీగా ఛాన్సు కొట్టేశారు. వీరిద్దరూ ప్రైవేటుగా తిట్టుకోవాలంటే.. ఫోన్‌ చేసి తిట్టుకోవచ్చు.. లేదంటే.. సోషల్ మీడియాలోనూ పర్సనల్‌ గా చాట్ చేసుకోవచ్చు. కానీ.. పబ్లిగ్గా.. ఎంపీలం అనే స్పృహ లేకుండా ఇలా సోషల్ మీడియా వీధుల్లో బూతులతో తిట్టుకోవడం మాత్రం నాయకుల పరువు తీసేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: