కేసీఆర్‌ దయ ఎప్పుడో.. మురళీమోహన్‌ కామెంట్స్‌?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పై సీనియర్ నటుడు మురళీ మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.. సినీనటులకు అవార్డులు ఆక్సిజన్ లాంటివన్న మురళీమోహన్.. నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టాయని అన్నారు. ఏడేళ్ల నుంచి నంది అవార్డులు ఇవ్వడం లేదని  మురళీమోహన్ గుర్తు చేసుకున్నారు. మరి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పుడు దయ కలుగుతుందో అవార్డులు ఇవ్వడానికి అని మురళీమోహన్ అన్నారు.

హైదరాబాద్  ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఉగాది సినిమా పురస్కారాల వేడుకలో మురళీ మోహన్ ఈ కామెంట్ చేశారు. 24 విభాగాలకు చెందిన సినీ ప్రముఖులకు అక్కడ ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీనటులు బ్రహ్మానందం, మురళీమోహన్ , సి.కళ్యాణ్ హాజరయ్యారు. నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని తెలుగు ప్రభుత్వాలు పక్కన పెట్టాయన్న మురళీ మోహన్ ప్రైవేటు సంస్థలు నటీనటులకు అవార్డులు ఇస్తున్నాయని గుర్తు చేశారు.

స్టూడియో సెక్టార్ నుంచి రమేష్ ప్రసాద్ కు ఉగాది పురస్కారాన్ని మురళీమోహన్, బ్రహ్మానందం ప్రదానం చేశారు. పాపం.. ఆవేదనతో అన్నా.. మురళీ మోహన్ వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డులను పట్టించుకోవం మానేశాయి. వాస్తవానికి సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో కేంద్రీకృతం అయి ఉంది.. కానీ.. ఆ సినిమా ఇండస్ట్రీలో ఆంధ్ర ఆధిపత్యం ఎక్కువ.. తెలంగాణ ప్రాంతానికి చెందిన కళాకారులు, ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నారు.

బహుశా ఆ కారణంగానో ఏమో.. మొత్తానికి తెలంగాణ సర్కారు నంది అవార్డులను ఇవ్వడం లేదు. ఆ తర్వాత కొన్నాళ్ల క్రితం సింహా అవార్డులు ఇస్తామన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక అక్కడ ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డుల గురించి పట్టించుకోవడం లేదు. అక్కడ కొలువైన జగన్ సర్కారు కూడా సినీ ఇండస్ట్రీ పట్ల అంత సానుకూలంగా ఏమీ లేదు. మొత్తానికి అలా సినీ కళాకారులకు ఆక్సిజన్ లాంటి అవార్డులు అందడం లేదు. నంది అవార్డులు అంటే.. అదో ప్రత్యేకమైన గుర్తింపు. దాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం పట్టించుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: