వైసీపీ నేత‌ల‌ `స్పీక‌ర్` రేస్‌.. మామూలుగా లేదుగా..!

VUYYURU SUBHASH
విజ‌య‌న‌గ‌రం జిల్లా వైసీపీ నేత‌ల మ‌ధ్య హాట్ టాపిక్ పై చ‌ర్చ సాగుతోంది. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ లేదా ప్ర‌క్షాళ‌న చేయ నున్న నేప‌థ్యంలో ఈ జిల్లాకు కీల‌క ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని, నాయ‌కులు భావిస్తున్నారు. కొంద‌రు దీనికి సంబంధించి లెక్క‌లు కూడా వేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్ర‌స్తుతం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వ‌ల‌స ఎమ్మెల్యేగా ఉన్న త‌మ్మినేని సీతారాం.. మం త్రి ప‌ద‌విని ఆశిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ క‌నుక క‌రుణిస్తే.. ఆయ‌న‌కు అవ‌కాశం ద‌క్క‌వొచ్చు. మంచి వాయిస్‌. టీడీపీని టార్గెట్ చేయ‌గ‌ల స‌త్తా ఉన్న నేప‌థ్యంలో సీతారాంను మంత్రిగా తీసుకుంటే.. స్పీక‌ర్ పోస్టు ఖాళీ అవుతుంది.

ఇప్పుడు ఈ పోస్టు విష‌యంపైనే విజ‌య‌న‌గ‌రం నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు.. స్పీక‌ర్ పోస్టుపై ఆశ‌లు పెట్టుకున్నార‌ని జిల్లాలో వైసీపీ నేత‌ల మ‌ధ్య టాక్ న‌డుస్తోంది. వీరిలో సీనియ‌ర్ ఎమ్మెల్యే వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి, మ‌రో ఎమ్మెల్యే శంబంగి వెంక‌ట చిన అప్ప‌ల నాయుడు.. ఈ రేసులో ఉన్నార‌ని.. అంటున్నారు. నిజానికి కోల‌గ‌ట్ల‌కు మంత్రి ప‌ద‌విపై ఆశ లు ఉన్నాయి. ఇటీవ‌ల కొన్నాళ్లుగా ఆయ‌న ఈ ఆశ‌ను బ‌హిర్గ‌తం చేస్తున్నారు కూడా. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసేది లేద‌ని.. ఏదైనా ఉంటే.. ఇప్పుడే.. ఒక ప‌ద‌వి ఇవ్వాల‌ని.. ఆయ‌న మ‌న‌సులో మాట ను చెబుతున్నారు.

కానీ, ఇదే జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్యానారాయ‌ణ‌తో ఉన్న విభేదాల కార‌ణంగా కోల‌గ‌ట్ల‌కు ఈ అవ‌కాశం ద‌క్కుతుంద‌నే ఆశ‌లు లేవు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న స్పీక‌ర్ పోస్టు కోసం కుస్తీ ప‌డుతున్నార‌ని అంటున్నారు. మ‌రో నేత చిన అప్ప‌ల నాయుడు కూడా మంత్రి రేసులో ఉన్నా.. త‌న అనుభ‌వానికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ద‌ని భావిస్తున్నారు. త‌న క‌న్నా సీనియ‌ర్లు లేదా.. ఎస్టీ కోటాలో ఈ జిల్లా నుంచి మ‌హిళ‌లు ఉండ‌డంతో వారికి ద‌క్క‌తుంద‌ని ఈయ‌నే చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తే.. రుణం తీర్చుకుంటాన‌ని.. కార్య‌క‌ర్తల స‌మావేశాల్లో త‌న‌మ‌నసులో మాట‌ను బాహాటంగానే వెల్ల‌డిస్తున్నారు.

ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ స‌మావేశాల్లో స‌ల‌హాదారు స‌జ్జ‌ల‌ను సైతం క‌లిసిన చిన అప్ప‌ల‌నాయుడు.. త‌న‌కు ఎలివేష‌న్ ఇవ్వాల‌ని కోరార‌ట‌. అయితే.. త‌న చేతిలో ఏమీ లేద‌ని.. సీఎం సార్‌నే అడ‌గాల‌ని చెప్పార‌ట‌. దీంతో ఆయ‌న రెండు రోజులు విజ‌య‌వాడ‌లోనే ఉండి ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. ఇక‌, కోల‌గ‌ట్ల మాత్రం త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన మంత్రి వెల్లంప‌ల్లి ద్వారా క‌బురు చేర‌వేశార‌ని.. విజ‌య‌నగ‌రంలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అటు వెలంప‌ల్లి కూడా త‌న ప‌ద‌వికి ముప్పు రాకుండా.. ఉండేందుకు .. కోల‌గ‌ట్ల‌ను స్పీక‌ర్ చేసేస్తే బెట‌ర్ అని వ్యాఖ్యానిస్తున్నార‌ట‌. ఏదేమైనా.. ఈ విష‌యం విజ‌య‌న‌గ‌రం పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో జోరుగా చ‌ర్చనీయాంశం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: