ఆ కులం చేసే యుద్ధంలో న‌లుగుతోన్న‌ వైసీపీ, టీడీపీ..!

VUYYURU SUBHASH
ఔను! ఇప్పుడు రాష్ట్రంలోని కాపు సామాజిక వ‌ర్గానికి ఏం చెబుతారు? వారిని ఎలా స‌ర్దుబాటు చేస్తారు? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వారి ఓటు బ్యాంకును ఎలా స‌మీక‌రిస్తారు? ఇదీ.. ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. దీనికి కారణం.. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం కాపుల రిజ‌ర్వేష‌న్ అంశంపై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డ‌మే. కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌ని.. సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉంది. 2014 ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వారికి హామీ కూడా ఇచ్చారు. ఆయ‌న చెప్పిన‌ట్టు జ‌ర‌గ‌లేదు.
దీంతో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆందోళ‌న‌కుదిగారు. ఇది రెండేళ్లు నిర్విరామంగా సాగింది. కేసులు పెట్టారు. అయినా.. వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇక‌, 2018లో ఎన్నిక‌ల‌కు ముందు.. అనూహ్యంగా.. కేంద్రం తీసుకువ‌చ్చిన ఈడబ్ల్యు ఎస్ రిజ‌ర్వేష‌న్‌ను చంద్ర‌బాబు వినియోగించుకున్నారు. ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ఇచ్చిన 10 శాతం రిజ‌ర్వేష‌న్‌లో నుంచి 5 శాతం కాపుల‌కు ఇచ్చేశారు. అయితే.. దీనిని కూడా అప్ప‌ట్లో చంద్ర‌బాబు అమ‌లు చేయ‌లేదు. ఎన్నిక‌ల‌కు ముందు మాత్రం ప్ర‌క‌టించారు. దీనివ‌ల్ల కాపుల‌ను కొంత శాంత ప‌ర‌వ‌చ్చ‌ని ఆయ‌న భావించారు.
అయితే.. వారు చంద్ర‌బాబుకు ఓట్లు వేయ‌లేదు. ఈ క్ర‌మంలోనే దీనికి సంబంధించి రాష్ట్ర‌ప‌తికి ఒక తీర్మానం చేసిపంపించారు. ఈబీసీలో వారికి 5 శాతం రిజ‌ర్వేష‌న్ చేయాల‌ని అనుకుంటున్నాం.. మీరు అనుమ‌తించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కోరింది. అయితే.. దీనిపై అప్ప‌ట్లోనే రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం రాష్ట్రానికి ఒక లేఖ రాసింద‌ని.. తాజాగా కేంద్రం వెల్ల‌డించింది. 2017లోనే రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం.ఈ విష‌యంలో మీరు స్వ‌తంత్రంగా నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు.. విద్య‌, ఉద్యోగ నియామ‌కాల్లో వారికి మీరు చేయాల‌నుకున్న రిజ‌ర్వేష‌న్ చేయొచ్చ‌ని రాష్ట్ర‌ప‌తి కార్యాలయం స్ప‌ష్టంచేసింది.
అయితే.. చంద్ర‌బాబు మాత్రం దీనిని అమ‌లు చేయ‌లేదు. ఇక‌, ఆయ‌న తీసుకువ‌చ్చిన ఈడబ్ల్యుఎస్ కోటాను.. జ‌గ‌న్ కూడా అమ‌లు చేయ‌లేదు. దీంత ఇప్ప‌టి వ‌ర‌కు కూడా త‌మ చేతిలో ఏమీ లేదు.. అంతా కేంద్రంలోనే ఉంద‌ని ఇరు పార్టీలు కాపుల‌కు చెప్పుకొచ్చాయి. కానీ, ఇప్పుడు విష‌యం స్ప‌ష్టంగా తేలిపోయింది. దీంతో ఇప్పుడు ఏం చేస్తార‌నే ది ప్ర‌శ్న‌గా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కాపులు ఈ విష‌యంపైనే ప‌ట్టుబ‌డ‌తారు. అంటే.. ఈబీసీ కోటాలో 5 శాతం లేదా..ఈ డ‌బ్ల్యుఎస్ కోటాలో 5 శాతం ఏది ఇచ్చినా.. కాపుల‌కు మేలు జ‌రుగుతుంది.
కానీ,ఈ బీసీలో ఇచ్చేందుకు బీసీలు.. ఈడ‌బ్ల్యుఎస్‌లో ఏకంగా 5 శాతం ఇచ్చేందుకు ఓసీలు ఒప్పుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఇరు పార్టీలు త‌ప్పించుకున్నాయి. కానీ, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మాత్రం త‌ప్పించుకునే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో వైసీపీ, టీడీపీల‌కు కాపుల గండం పొంచి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: