కొత్త డిబేట్‌: ఏపీ చరిత్రలో అతి చెత్త ఆర్థిక మంత్రి ఎవరు..?

రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో.. ఆ తర్వాత ముఖ్యమైన వ్యక్తి ఆర్థిక మంత్రి.. ఆర్థికంగా ఇబ్బంది ఉన్న రాష్ట్రాల్లో ఆర్థిక మంత్రిది మరింత కీలక పాత్ర అవుతుంది. ఉమ్మడి ఏపీ చరిత్రలో ఎందరో ఆర్థిక మంత్రులుగా వ్యవహరించారు. కొందరినైతే ఆర్థిక మంత్రిగా తప్ప ఇతర శాఖల్లో మంత్రిగా ఊహించలేనంతగా పాపులర్ అయ్యారు. ప్రతిభ చూపించారు. అలాంటి వారిలో కొణిజేటి రోశయ్య ఒకరు. ఆయన ఏకంగా పది కంటే ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సీఎంగా వైఎస్సార్ ఉన్నప్పడు ఆర్థిక మంత్రిగా కొణిజేటి రోశయ్య చాలా కీలకపాత్ర పోషించారు. వైఎస్ ప్రకటించే పథకాలకు నిధులు సర్దలేక సతమతం అయ్యేవారు.

అలా ఆర్థిక మంత్రులుగా ఎందరో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కర్‌రావు కూడా ఆర్థిక మంత్రే.. ఆ తర్వాత ఎన్టీఆర్ హయాంలో చంద్రబాబు కూడా ఆర్థిక మంత్రిగా పని చేశారు.. ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు జగన్ హయాంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉన్నారు.

అయితే.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఇటీవల అసలు మీడియా ముందుకు రావడమే మానేశారు. అంతే కాదు.. ఆయన ఎక్కువగా డిల్లీలోనే గడుపుతున్నారు. కొత్త అప్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన్ను సీఎం జగన్‌ ఢిల్లీలో ఉంచారని టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటారు.. ఇటీవల కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ నేతలలతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు.

ఈ విమర్శలపై స్పందించిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి.. మాజీ ఆర్థిక మంత్రి యనమలపై విరుచుకుపడ్డారు.  ఏపీ చరిత్రలోనే అతి చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే టీడీపీలో కట్టప్పగా చెప్పుకునే యనమల పేరు వినిపిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ఏడాదిలో 300 రోజులకు పైగా ఓవర్ డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లిన చరిత్ర యనమలది అని అన్నారు. పైగా తానో పేద్ద మేధావినంటూ నీతి వచనాలు చెబుతారని.. ఆయన్ని ప్రజలు ఏనాడో మర్చిపోయారని విజయసాయి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: