యూపీలో కాంగ్రెస్ త‌ల‌రాతను ప్రియాంక మార్చ‌గ‌ల‌రా..?

ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రానికి సెమీ ఫైన‌ల్సేన‌ని చెప్పాలి. ఎందుకంటే వీటిలో అతిపెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కూడా ఉంది కాబ‌ట్టి. ఇక్క‌డ గెలుపోట‌ములు రేపు ఢిల్లీ పీఠం ఎవ‌రిద‌న్న అంశాన్ని నిర్ణ‌యించే ప్ర‌భావ‌శీల అంశాలు కాబ‌ట్టి. అందుకే కాంగ్రెస్ పార్టీ త‌మ తురుఫు ముక్క ప్రియాంక గాంధీని సీఎం అభ్య‌ర్థిగా నిర్ణ‌యించి యూపీ ఎన్నిక‌ల గోదాలోకి దిగ‌బోతోంద‌ని స్ప‌ష్ట‌మైంది. యూపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి రాహుల్ గాంధీతో క‌లిసి శుక్ర‌వారం పార్టీ యూత్ మ్యానిఫెస్టోను విడుద‌ల చేసిన సంద‌ర్భంగా.. కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌ని మీడియా సంధించిన ప్ర‌శ్న‌కు ప్రియాంక .. నేను త‌ప్ప ఇంక మీకెవ‌రు క‌నిపిస్తున్నారు..? అంటూ స్ప‌ష్టంగానే జ‌వాబిచ్చారు. అంటే అధికారిక ప్ర‌క‌ట‌నే ఇక త‌రువాయి అనుకోవాలి. అయితే ప్రియాంక రాక‌తో యూపీలో వెంట‌నే కాంగ్రెస్ పార్టీ అద్భుత‌మైన ఫ‌లితాలు సాధించ‌గ‌ల‌దా అంటే సాధ్యం కాదనే చెప్పాలి. కానీ కార్య‌క‌ర్త‌ల్లో కొత్త ఉత్సాహం, ఉత్తేజం వ‌స్తాయి. పార్టీ ప‌త‌నానికి అడ్డుక‌ట్ట వేసి దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాలను ప్రియాంక కాపాడ‌గ‌ల‌ర‌నే పార్టీ అధిష్ఠానం కూడా న‌మ్ముతోంది. కొంత‌కాలంగా ఆ రాష్ట్రంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఆమె పోరాడుతున్న తీరు కూడా దీనినే చాటుతోంది.
 
నిజానికి ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో మూడు ద‌శాబ్దాల‌కు పైగా ఆ పార్టీ అధికారానికి దూరంగా ఉండిపోయింది. 1988 జూన్‌నుంచి 89 డిసెంబ‌ర్ వ‌ర‌కు అధికారంలో ఉన్న ఎన్డీ తివారీ త‌రువాత మ‌రెవ్వ‌రూ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఇప్ప‌టిదాకా ఆ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి కాలేక‌పోయారు. అయితే సీఎం పీఠం ద‌క్క‌క‌పోయినా,అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకోవ‌డం ద్వారా వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో చెప్పుకోద‌గిన స్థాయిలో సీట్లు సాధించ‌డ‌మే ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా క‌నిపిస్తోంది.

2004 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 12 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీ 9 ఎంపీ స్థానాల‌ను గెలుచుకుంది. ఇక అప్ప‌ట్లో ఇత‌ర రాష్ట్రాల్లోనూ పొత్తుల‌తో యూపీఏగా ఏర్ప‌డి కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగింది. ఆ త‌రువాత 2009 ఎన్నిక‌ల‌నాటికి ఓట్ల శాతాన్ని18.3 శాతానికి పెంచుకుని 21 సీట్ల‌ను గెలుచుకోగ‌లిగింది. అయితే 2014 ఎన్నిక‌ల‌నాటికి ఓట్ల‌శాతం 7.5 శాతానికి కుచించుకుపోవ‌డంతో 2 సీట్ల‌కు ప‌రిమిత‌మైంది. కేంద్రంలో అధికారాన్ని బీజేపీకి కోల్పోయింది. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట్ల శాతం 6.5 శాతానికి దిగ‌జార‌డంతో 80 స్థానాలున్న ఆ రాష్ట్రంలో ఒకే ఒక స్థానాన్ని మాత్ర‌మే గెలుచుకోగ‌లిగింది. కాంగ్రెస్‌కు చిర‌కాలంగా కంచుకోట‌గా ఉన్న అమేథీని సైతం ఆ పార్టీ కోల్పోవ‌డం, అక్క‌డ స్వ‌యంగా కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్ర‌చారం జ‌రిగిన‌ రాహుల్ గాంధీ ఓట‌మి పాల‌వ‌డం ఆ పార్టీ శ్రేణుల‌ను తీవ్ర నిరాశ‌లోకి నెట్టేశాయి. ఈ నేప‌థ్యంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బ‌ల‌ప‌డేందుకు త‌మ బ‌ల‌మైన అస్త్రాన్ని కాంగ్రెస్ బ‌య‌ట‌కు తీసింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్రియాంక గాంధీ పార్టీ త‌ర‌పున పెద్ద బాధ్య‌త‌ల‌నే భుజాన వేసుకున్నార‌ని చెప్పాలి. ఆమె ఆధ్వ‌ర్యంలో యూపీలో కాంగ్రెస్ పార్టీ సాధించే ఫ‌లితాలు దేశ రాజకీయాల‌పై ఏమేర‌కు ప్ర‌భావం చూప‌గ‌ల‌వ‌న్న‌ది ఆస‌క్తిక‌ర‌మే.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: