రహస్యం: జగన్ ఫెయిల్యూర్ సీక్రెట్ చెప్పేసిన నిర్మలమ్మ..?

ఏపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతోంది.. ఇది విపక్షాలు తరచూ చెబుతున్నమాట.. ఏపీ ప్రభుత్వం అప్పులు తీర్చేందుకు కూడా అప్పులే చేస్తోంది.. ఇది నివేదికలు చెబుతున్నమాట.. ఏపీ సర్కారు రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేస్తోంది.. ఇదీ విపక్షాల విమర్శే.. ఏపీ ప్రభుత్వం కొత్త అప్పుల కోసం కొత్త ఎత్తులు వేస్తోంది.. ఇదీ విపక్షాలు చేస్తున్న విమర్శే. కేంద్ర చట్టాలకు దొరక్కుండా.. అనేక కార్పోరేషన్‌లు ఏర్పాటు చేస్తూ.. ఆ కార్పోరేషన్ల సాయం ఏపీ అప్పులు చేస్తోందన్న విమర్శలూ కొత్తవి కాదు.

ఇవే కాదు.. ఏపీ ప్రభుత్వంలోని వివిధ శాఖల వద్ద మిగిలిన ఉన్న నగదంతా కేవలం ఫైనాన్స్ కార్పొరేషన్లోనే జమ చేయాలని.. ప్రైవేటు బ్యాంకుల్లో జమ చేయవద్దని తాజాగా తెచ్చిన నిబంధన కూడా సర్కారు వద్ద నగదులేదనే అంటూ కొత్త విమర్శలు పుట్టుకొస్తున్నాయి. అయితే.. ఏపీ ప్రభుత్వం ఫెయిల్యూర్‌ పై కేంద్రం కూడా తనదైన శైలిలో స్పందించింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు జవాబిచ్చిన నిర్మలా సీతారామన్.. ఏపీలో 2019-20లో ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని గుర్తు చేశారు.

ఊహించిన దానికంటే ఎక్కువ లోటు ఉందని వివరించారు నిర్మలా సీతారామన్. ఇందుకు కారణాలు కూడా ఆమె చెప్పుకొచ్చారు. అమ్మ ఒడి, ఉచిత విద్యుత్ పథకాల వల్ల ఎక్కువ రెవెన్యూ లోటు కనిపిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత పథకాల వల్లే రెవెన్యూ లోటు అధికంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. ఏపీలో ఆర్థిక క్రమశిక్షణ లోపంతో లోటు పెరిగిందని కాగ్ కూడా చెప్పిందని నిర్మల సీతారామన్ చెబుతున్నారు. ఇదీ ఏపీలో ఆర్థిక ఇబ్బందులకు కారణం అంటూ నిర్మలమ్మ చెప్పిన భాష్యం.

అయితే.. ఇదే విషయాన్ని ఒప్పుకునేందుకు ఏపీ సర్కారు సిద్ధంగా లేదు. ఒకవేళ ఒప్పుకున్నా.. ఎదురుదాడి చేసే ఆస్కారం కూడా ఉంది. ఏం.. మీ కేంద్రానికి అప్పుల్లేవా.. అసలు అప్పులు లేని రాష్ట్రం ఏది.. అంటూ ఎదురుదాడి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయినా కరోనా కారణంగా కాలం కలసి రాలేదు కానీ.. లేకుంటే ఈ పరిస్థితి ఎందుకొస్తుంది అంటూ సమర్థించుకుంటున్నారు కొందరు ఏపీ మంత్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: