ఉప్పుడు బియ్యం వివాదం.. రైతుకు ప్రాణ సంకటం..!

అనేక రకాల పంటలు పండించడమే వ్యవసాయం అయినప్పటికీ... తెలుగు రాష్ట్రాల్లో వరి.. వ్యవసాయం పర్యాయపదాలుగా ఉంటాయి. పత్తి, మిరప, పసుపు వంటి వాణిజ్య పంటల కన్నా... ప్రజలందరికీ అన్నంపెట్టే... వరి సాగంటేనే రైతులు ఇష్టపడతారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో వరిసాగు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. సాగునీటి పారుదల సౌకర్యాలు మెరుగుపడడం, ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో... గతంలో కన్నా ఎక్కువగా వరిసాగు పెరిగింది. అయితే ఏ పంట అయినా.. ఎంత మక్కువతో పండించినా.. గిట్టుబాటు ధర లభిస్తేనే అన్నదాత జీవితం గడుస్తుంది. పంట చేతికి రాగానే... అమ్ముడుపోతే.. పడిన కష్టాన్నంతా మర్చిపోతారు రైతులు. కానీ కేంద్రం ఇప్పుడు తీసుకున్న ఓ నిర్ణయం రైతుల నోట్లో మట్టికొడుతోంది. ఇకపై బాయిల్డ్ రైస్‌ ఒక్క గింజ కూడా కొనేది లేదని కేంద్రం తెగేసి చెప్పడంతో.... వరి పండించే రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
యాసంగి, రబీ సీజన్లలో పండే ధాన్యంలో 90 శాతాన్ని ఉప్పుడు బియ్యంగా మారుస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ బియ్యాన్ని ఇడ్లీ రవ్వకు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో ఈ బియ్యం వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో కేంద్రం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసి ఆ రాష్ట్రాలకు అందిస్తుంది. రెండు రాష్ట్రాల్లో రేషన్ ద్వారా ఉప్పుడు బియ్యం పంపిణీ చేస్తారు. అయితే తమిళనాడు, కేరళలో ఉత్పత్తి పెరిగింది. దీంతో తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం కొనుగోలు చేసి.. ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేసే బదులు.. స్థానికంగానే కొనాలని ఎఫ్‌సీఐ భావిస్తోంది. ఇది తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగించనుంది.
ఉప్పుడు బియ్యం రైతులకు లాభదాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతో... ప్రభుత్వాలు గతంలో ప్రోత్సహించాయి. వంద కేజీల ధాన్యానికి 68 కేజీల ఉప్పుడు బియ్యం వస్తాయి. సాధారణ బియ్యంగా మార్చితే... 40 నుంచి 50 శాతం నూక అవుతున్నాయి. దీంతో ఉప్పుడు బియ్యంగా మార్చి రాష్ట్రం ఎఫ్‌సీఐకి అమ్మేది. దీనివల్ల తెలంగాణ వ్యాప్తంగా ఉప్పుడు బియ్యం మిల్లులు కూడా లాభాల్లో సాగేవి.
ధాన్యం సేకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రైతుల నుంచి కొనుగోళ్లను పెంచింది. అలాగే గత యాసంగిలో 92 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నది. ప్రస్తుతం రైతులు 55 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారు. దీని వల్ల 1.4 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి  వస్తుంది.  అయితే కేంద్రం ఈ ఏడాది 60 లక్షల టన్నులు మించి ధాన్యం తీసుకోబోమని  తేల్చిచెప్పింది. కేంద్రం దగ్గర ఐదేళ్లకు సరిపడా నిల్వలున్నాయి వచ్చే ఏడాది నుంచి ఉప్పుడు బియ్యాన్ని అస్సలు కొనేది లేదని స్పష్టంచేసింది. ఇప్పటికే రాష్ట్రం కొనుగోలు చేసిన ధాన్యంలో సుమారు 70 లక్షల టన్నులు ఇంకా  రైస్‌ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వ ఉన్నాయి. కొత్తగా సాగయ్యే ధాన్యం కూడా చేరితే... భారీగా నిల్వలు పేరుకుపోతాయి. కేంద్రం ఉప్పుడు బియ్యం కొనుగోలు ఆపేస్తే.. ఈ నిల్వల వల్ల రాష్ట్రం, రైతులు, మిల్లర్లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. బాయిల్డ్ రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం కూడా ఉంది.
ఈ నష్టాల నుంచి బయటపడాలంటే... వరిసాగు తగ్గించాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వరికి బదులుగా వచ్చే యాసంగి నుంచి శనగలు, వేరు సెనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే  లాభాలు వస్తాయని ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలంటే ప్రత్యామ్నాయ పంటలు పండించడం మినహా మరోదారి లేదని ప్రభుత్వం చెబుతోంది. మరి అన్నదాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: