అయోధ్య రాములోరి దర్శనం అప్పుడే..!

యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ ఘడియ రానే వచ్చింది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మొదలైన అయోధ్య రాములోరి ఆలయ నిర్మాణం శర వేగంతో జరుగుతోంది. శ్రీరాముల వారి జన్మస్థలం అయోధ్యలో ఆలయం నిర్మించాలనే రామ జన్మభూమి ట్రస్ట్ కల త్వరలోనే నెరవేరనుంది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రాముల వారి ఆలయ నిర్మాణాన్ని రామ జన్మభూమి ట్రస్టు ప్రారంభించింది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా విరాళాలు కూడా సేకరించారు. ఆలయ భూమి పూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు కూడా.
రాముల వారి దర్శనం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న భక్తులకు రామ జన్మభూమి ట్రస్టు శుభవార్త చెప్పింది. ఇప్పటికే అయోధ్యలో రామాలయం కోసం తవ్విన పునాది ప్రదేశాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు. అలాగే ఆలయం మొత్తం ప్రాంగణానికి సంబంధించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్ కూడా రెడీగా ఉందని తెలిపారు. అలాగే ఆలయ నిర్మాణాన్ని సరిగ్గా రెండేళ్లలో పూర్తిచేసి 2023 సంవత్సరం నాటికి భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకునేలా ప్రణాళిక రూపొందించినట్లు రామ్ టెంపుల్ ట్రస్ట్ తెలిపింది.
ఆలయ నిర్మించ తలపెట్టిన ప్రదేశంలో 18 వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 12 మీటర్ల లోతు వరకు తవ్వకాలు జరిపినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శిధిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత... ప్రస్తుతం తవ్విన ప్రదేశాన్ని నింపే పని చివరి దశలో ఉందన్నారు. ఆలయ నిర్మాణ పనులు చేపట్టిన ఎల్ & టీ సంస్థతో పాటు టాటా కన్సల్టింగ్ ఇంజినీర్లు, ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీ సభ్యులు కూడా ఈ పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. తొలుత 18 నెలల ప్రణాళికతో మొదలు పెట్టిన పనులు.... కేవలం 5 నెలల్లోనే పూర్తి చేసినట్లు ట్రస్ట్ సభ్యులు వెల్లడించారు.
ప్రధాన ఆలయం వెలుపల మొత్తం క్యాంపస్ కోసం ఇప్పటికే ప్రాథమిక ప్లాన్ సిద్ధంగా ఉందని... అలాగే ఆలయ మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేయడానికి గౌరవనీయులైన సాధువులు, పీఠాధిపతుల సలహాలను కూడా పరిశీలిస్తున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది. ఇప్పటికే ఆలయం పార్కోటా లే అవుట్ పూర్తిస్థాయిలో ఖరారు చేసినట్లు తెలిపింది. ఆలయ పార్కోటా లే అవుట్‌ ఏరియాలో తీర్థయాత్ర సదుపాయం కేంద్రం, మ్యూజియం, పరిశోధనా కేంద్రం, ఆడిటోరియం, గోశాల, యాగశాల, పరిపాలన భవనం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కుబేర్ తిలా, సీతా కూప్ వంటి వారసత్వ నిర్మాణాల పరిరక్షణ, అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అలాగే కాంప్లెక్స్ మొత్తం కూడా జీరో డిశ్చార్జ్ కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్నామన్నారు. అలాగే పర్యావరణానికి పెద్ద పీట వేస్తూ పచ్చదనం ఉట్టిపడేలా ప్రాంగణం ఉంటుదన్నారు ట్రస్ట సభ్యులు. ఇక ఆలయ నిర్మాణానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తీవ్రమైన భూకంపాలు కూడా తట్టుకునేలా సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిపుణులు ప్రణాళికలు అందించారన్నారు. మట్టి లక్షణాలను జియో టెక్నికల్ పరిశోధనల ద్వారా లెక్కించి... ఆలయ నిర్మాణానికి కావాల్సిన రోలర్ కాంపాక్ట్‌ను ఐఐటీ చెన్నై నిపుణులు అందస్తున్నారని తెలిపారు. మిర్జాపూర్ స్టోన్‌తో ఏకంగా 16 అడుగుల పునాది నిర్మిస్తున్నాట్లు వెల్లడించారు. అలాగే పునాది స్తంభం చుట్టూ మూడు పొరల గ్రానైట్ రాయితో డిజైన్ చేశామన్నారు. ఇక ఆలయ సూపర్ స్ట్రక్చర్ మొత్తం కూడా రాజస్థాన్‌లోని బాన్సీ పహార్పూర్ స్టోన్‌తో నిర్మిస్తున్నామన్నారు. ఇందుకోసం 4 లక్షల క్యూబిక్ అడుగుల రాయి ఉపయోగిస్తున్నట్లు ట్రస్ట్ బోర్డు సభ్యులు వెల్లడించారు. అలాగే ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా ఉక్కును ఉపయోగించటం లేదని... పార్కోటా కోసం కూడా జోథ్‌పూర్ రాయినే వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: