2024నాటికి వలసనాయకులే టీడీపీకి బలాన్నిస్తారా..?

Deekshitha Reddy
2019 సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలో ఎరుగని పరాజయాన్ని సొంతం చేసుకుంది టీడీపీ. అప్పటినుంచి ఇప్పటి వరకు పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగు కాలేదనే చెప్పాలి. చేతిలో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే జారిపోతున్నారు. అధికారికంగా నలుగురు ఎమ్మెల్యేలు పక్కకు వెళ్లారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి డైలమాలో ఉన్నారు. ఈ దశలో 2024నాటికి టీడీపీ పరిస్థితి ఏంటి..? మిగతావారు కూడా చేజారతారా లేక కొత్త బలం వస్తుందా..?
ప్రస్తుతానికయితే టీడీపీ బలం రోజు రోజుకీ తగ్గుతోంది. అయితే పార్టీలోని ఓ వర్గం మాత్రం 2024నాటికి టీడీపీ పుంజుకుంటుందని ధీమాగా చెబుతోంది. ప్రస్తుతం జగన్ పాలన, జగన్ ప్రవర్తనతో అసంతృప్తిగా ఉన్న నేతలు టీడీపీవైపుకి వచ్చేస్తారని అంటున్నారు.
జగన్ పై అసంతృప్తి ఎందుకు..?
రెండేళ్లకోసారి మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తానని గతంలోనే చెప్పారు సీఎం జగన్. ఆ క్రమంలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులకు సమయం వచ్చేసింది. అయితే చాలామంది ఆశావహులు పదవులకోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో అందరికీ సీఎం జగన్ న్యాయం చేయలేకపోవచ్చు. మరోవైపు ఉన్న పదవుల్నుంచి తీసేస్తే, నియోజకవర్గాల్లో తలెత్తుకోలేని పరిస్థితిలోకి వచ్చేస్తారు కొందరు ఎమ్మెల్యేలు. ఎలా చూసుకున్నా అసంతృప్తి ఉండనే ఉంది. అందుకే ఆ బ్యాచ్ లో కొందరు టీడీపీలో చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అటు కార్పొరేషన్ పదవులకి కూడా ఎలాంటి అధికారాలు, కార్యాలయాలు లేవని చెబుతున్నారు. సో.. కార్పొరేషన్ పదవులు పొందినవారు కూడా అసంతృప్తితోనే ఉన్నారనేది టీడీపీ చెబుతున్న మాట. అందులోనూ గతంలో టీడీపీతో అనుబంధం ఉన్న చాలామంది ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. వారిలో సరైన ప్రాతినిధ్యం దక్కనివారు టీడీపీలోకి వస్తారని ఆ వర్గం అంచనా వేస్తోంది. టీడీపీ తరపున గెలిచి, వైసీపీలోకి వెళ్తున్న ఎమ్మెల్యేలకు కూడా స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులున్నాయి. అక్కడ ఉన్న వైసీపీ ఇన్ చార్జిలకు కూడా ఇది ఇబ్బందికరంగా ఉంది. దీంతో అలాంటి అసంతృప్తులంతా టీడీపీవైపు చూస్తారని, వారికి బీజేపీ, జనసేన ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని అంటున్నారు.
సో.. ఎలా చూసుకున్నా 2024నాటికి టీడీపీలోకి వలసలుంటాయనేది ఆ పార్టీ నాయకుల అంచనా. ప్రస్తుతానికి అధికార పక్షంవైపే అందరూ ఉన్నా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి టికెట్లు దొరకనివారు, హామీలు లభించనివారికి టీడీపీ ఆల్టర్నేట్ గా ఉంటుంది. అలాంటి వారితో బలం పెంచుకుని టీడీపీ నిజంగానే ఎన్నికల్లో నెగ్గగలదా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: