హెరాల్డ్ ఎడిటోరియల్ : మరీ ఇంత దిగజారుడు రాజకీయాలా ?

Vijaya

జనసేన అధినేత పవన్ కల్యాన్ కూడా దిగజారుడు రాజకీయాల్లోకి దిగేశారు. సినిమా షూటింగులు లేకపోతే రాజకీయాల్లో హడావుడి చేస్తారు. అలాగే రాజకీయాలకు విరామం లాగ సినిమా షూటింగుల్లో బిజీగా గడిపేస్తారు. తాజగా రైతులకు నష్టపరిహారం ఇవ్వటం లేదనే ఆరోపణలతో కృష్ణా జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రాలు అందించారు. అంతకుముందు గుడివాడలో భారీ రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా తన అభిమానులను ఎంటర్ టైన్ చేయటానికి వైసీపీ నేతలపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. సరే పవన్ ఆరోపణలకు, విమర్శలకు అభిమానులు కూడా ఉర్రూతలూగిపోయారులేండి. అయితే ఇక్కడే పవన్ ప్రస్తావించిన విషయాలే ఆశ్చర్యంగా ఉంది. వైసీపీ నేతలంతా తమ వ్యాపారాలను కట్టిపెట్టేసి కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమైతే తాను కూడా సినిమాలకు స్వస్తిచెప్పేసి రాజకీయాల్లో మాత్రమే ఉంటానన్నారు.



రాజకీయాల్లో ఉంటు సినిమాల్లో ఎలా నటిస్తున్నావని తనను వైసీపీ నేతలు అడగటంలో అర్ధంలేదంటూ పవన్ మండిపడ్డారు. తనను వైసీపీ నేతలు నాలుగు అంటే తాను తిరిగి వాళ్ళని పదంటానంటు చెప్పటం విచిత్రంగా ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే పవన్ను సినిమాలు చేసుకోవద్దని ఎవరు అడగలేదు. సినిమాల్లో నటిస్తు రాజకీయాల్లో ఎలా ఉంటావని కూడా వైసీపీ నేతలు ఆక్షేపించలేదు. 2017 ప్రాంతంలో ఇకనుండి తాను సినిమాల్లో నటించనని స్వయంగా పవనే చెప్పారు. రాజకీయాల కోసం తాను సినిమాలను వదులుకుంటున్నట్లు పవన్ చేసిన ప్రకటననే వైసీపీ నేతలు సందర్భానుసారంగా గుర్తుచేస్తున్నారంతే. ఇకనుండి తనకు ప్రజాసేవ తప్ప సినిమాలతో పనేలేదని చెప్పింది ఎవరు ? కోట్లరూపాయల ఆదాయం వచ్చే సినిమాలను వదులుకుని ప్రజాసేవ కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని పదే పదే పవనే స్వయంగా చెప్పుకున్నారు.



సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్ ఓడిపోయారు. దాంతో దిక్కుతోచక, 151 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టడం సాధ్యంకాదని అర్ధమైన తర్వాతే మెల్లిగా సినిమాల్లోకి వెళ్ళిపోయారు. అప్పటికే తాను అభిమానించే చంద్రబాబునాయుడు కూడా ఘోరంగా ఓడిపోవటం పవన్ కు షాక్ కొట్టినట్లయ్యింది. ఇక వైసీపీ ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే తమ వ్యాపారాలను వదులుకుని రాజకీయాలకే అంకితం అయిపోతామని ఎవరు ప్రకటించలేదే. ప్రజాసేవ కోసం తమ వ్యాపారాలను కూడా వదులుకుంటామని ఏ ప్రజాప్రతినిధి, నేత కూడా పవన్ లాగ సొల్లు కబుర్లు చెప్పలేదు. అంతెందుకు వైసీపీ నేతలే కాదు చాలామంది టీడీపీ నేతలకు కూడా ఎన్నో వ్యాపారాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి దిగజారుడు రాజకీయాలు చేయాలని అనుకుంటే పవన్ ఇష్టం. కానీ తనలాగే ఎదుటివాళ్ళని కూడా దిగజారుడు రాజకీయాల్లోకి లాగేయాలని అనుకుంటే మాత్రం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: