తుంగభద్ర పుష్కరాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక కథనం...

SS Marvels
రాష్ట్రంలో తుంగభద్ర నది పుష్కరాల సందడి మొదలైంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలు నేడు శుక్రవారం అనగా నవంబర్ 20న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక ఈ పవిత్ర పుష్కరాల సందర్భంగా భక్తులకు తుంగభద్ర నదీ పుష్కరాలపై ప్రత్యేక కథనం...
తుంగభద్ర.... ఈ నది కృష్ణా నదికి ప్రధానమైన ఉపనది. రామాయణ కాలంలో ఈ నదిని పంపా నదిగా పిలిచారని చెబుతుంటారు. తుంగ, భద్ర అనే రెండు నదుల కలయికే తుంగభద్ర. కర్ణాటక రాష్ట్రంలోని పడమర కనుమల్లో వరాహ పర్వత శ్రేణుల్లో గంగమూల అనే ప్రదేశంలో తుంగ, భద్ర అనే నదులు ఆవిర్భవించాయి. వేర్వేరుగా ప్రవహిస్తూ సుమారు 147 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. కర్ణాటకలోని కూడ్లీ వద్ద రెండు నదులు కలిసి తుంగభద్రగా అవతరించాయి. అక్కడి నుంచి శృంగేరి పీఠం, హంపీ మీదుగా కర్నూలు జిల్లా కౌతాలం మండలం మేళిగనూరు వద్ద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత అలంపూర్‌, కర్నూలు నగరం మీదుగా ప్రయాణించి సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
రాశిచక్రంలో పన్నెండు రాశులుండగా.. బృహస్పతి ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు దేశంలోని ప్రధాన నదులకు పుష్కరాలు వస్తాయి. ఇలా ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి ఒక్కో నదికి పుష్కరాలు జరుగుతాయి. గురువు మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్ర నదికి పుష్కరాలు ఏర్పడతాయి. శుక్రవారం మధ్యాహ్నం 1.21 గంటలకు గురువు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత తుంగభద్రకు పుష్కరాలు ప్రారంభమయ్యాయి.  గంగలో మునిగితే సకల పాపాలు హరించుకుపోతాయని, తుంగను తాకితే సర్వ రోగాలు మాయమవుతాయని పురాణాలు చెబుతున్నారు. అందుకే ‘గంగా స్నానం.. తుంగా పానం’ అన్న నానుడి వచ్చింది.
ఇక ఈ పవిత్ర పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు అందరూ ప్రస్తుతం బయట ఉన్న ప్రమాదకర కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా అవసరమైన కోవిడ్ నిబంధనలు అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: