హెరాల్డ్ ఎడిటోరియల్ : 'అన్న మనసు వెన్న' అని జగన్ నిరూపించుకున్నట్టేనా ?

ప్రజలు మెచ్చే వాడు ... ప్రజలకు నచ్చే వాడు... ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వాడు. చెప్పిన మాటను నిలబెట్టుకునే వాడు. ప్రజల కష్టాన్ని మానవత్వం తో అర్ధం చేసుకున్నవాడు. ఇలా అన్ని విషయాల్లో ఏపీ సీఎం జగన్ మనసున్న మారాజు అంటూ ఇప్పుడు పొగుడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇది నిజమేనా ? జగన్ పాలన అంతా జనరంజకంగా ఉందా ? మరి జగన్ పాలనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఏంటి ? అసలు జగన్ పాలన పై జనాలు ఏ విధంగా చర్చించుకుంటున్నారు..? ఇలా అనేక విషయాలపై పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ...

 


జగన్ అధికారంలోకి రావడమే ఒక సంచలనం. 175 స్థానాల్లో పోటీ చేసి 151 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించిన సత్తా మొత్తం సీఎం జగన్ ఖాతాలోనే పడుతుంది. ఎన్నికలకు  సుమారు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా జగన్ స్వయంగా ప్రజల వద్దకు వెళ్లారు. ఆ సందర్భంగా ప్రజల కష్టాలను స్వయంగా చూసి, చలించి తాను విన్న, చూసిన ప్రజా సమస్యలను మేనిఫెస్టోలో రూపొందించి వాటిని అధికారంలోకి రాగానే అమలు చేసి చూపించారు. ఇది నిజంగా దేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి  చేయని పనే. కానీ దాన్ని అమలు చేసి జగన్ చేసి చూపించారు. ఎన్నో నిర్ణయాలు వివాదాస్పదమైన జగన్ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. ఇక ఈ సమయంలో ప్రతిపక్షాల నుంచి జగన్ పై విమర్శలు పెరిగాయి. అయితే అవేవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు జగన్. ఇదిలా ఉంటే జగన్ పాలన జనరంజకంగా, అభివృద్ధివైపు దూసుకువెళ్తోంది అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోవడంతో, ఎక్కడికక్కడ పరిపాలన అంతా స్తంభించిపోయింది.

 


ఇక ఈ సమయంలో జగన్ కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ చేసిన కొన్ని సూచనలు, ప్రతిపక్షాలు అవహేళన చేసినా, జాతీయ స్థాయిలో జగన్ తీసుకున్న నిర్ణయాలకు  ప్రశంసలు వచ్చాయి. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సైతం జగన్ నిర్ణయాలు, ఆలోచనలను మెచ్చుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే జగన్ వలస కార్మికుల విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఆకస్మాత్తుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు విధించడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారంతా, చేసేందుకు పని లేక, తినేందుకు తిండి లేక అనేక అవస్థలు పడుతున్నారు.

 


లాక్ డౌన్ ఇప్పట్లో తీసే అవకాశం లేదనే అంచనాకు వచ్చిన వీరంతా తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు నడకనే మార్గంగా ఎంచుకుని, రోజుల తరబడి మండుటెండలో నడుస్తూ తమ సొంత గ్రామాలకు బయలుదేరారు. జాతీయ రహదారిపై ఎక్కడ చూసినా ఇప్పుడు వలస కార్మికులే. అష్టకష్టాలు పడుతూ పిల్లా, పాపలతో నడుస్తున్న సంఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం .ఈ విషయం జగన్ దృష్టికి కూడా రావడంతో ఆయన కార్మికుల కష్టాలను చూసి చాలించారు. అసలు ఈ వ్యవహారంలో కేంద్రం స్పందించాల్సి ఉన్నా, వలస కార్మికులకు,  భోజన వసతి సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది. అయితే కేంద్రం పట్టించుకోనట్టుగా వయ్వహారిస్తుండడంతో వలస కార్మికులు ఎవరికీ కాని వారిగా వారుగా మిగిలిపోయారు.

 

 జగన్ మాత్రం తమకు ఎందుకులే అన్నట్లుగా వారి కష్టాలను వారికి వదిలేయకుండా, స్వాంతన చేకూర్చే విధంగా ప్రయత్నించారు. రోడ్లపై ఏడుస్తూ భారంగా అడుగులు వేస్తున్న వలస కూలీల కు ఎక్కడికక్కడ భోజన సదుపాయాలు కల్పించడమే కాకుండా, వారికి ఒక జత చెప్పులు, అందించడంతో పాటు మన రాష్ట్ర సరిహద్దులు దాటే వరకు వారికి ఉచిత ప్రయాణం ఏర్పాటు చేసి బస్సులో వారిని తరలించడం వంటివి చేపట్టడంతో ఇప్పుడు జగన్ పై ప్రశంసలు కురవడానికి కారణం అవుతోంది.  సోషల్ మీడియాలోనూ జగన్ స్పందించిన తీరు పై ప్రశంసలు లభిస్తున్నాయి. అసలు ఇప్పటికే రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తీసుకొచ్చేందుకు ఆయా రాష్ట్రాలు పెద్దగా ఇష్టపడడం లేదు. కానీ ఈ విషయంలో జగన్ అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా వ్యవహరించారు. గుజరాత్ లో చిక్కుకున్న ఏపీకి చెందిన సుమారు ఐదు వేల మంది మత్యకారులను ఏపీకి రప్పించారు. దీని కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది.


కానీ అంతకు ముందు వరకు వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే జగన్ గుజరాత్ నుంచి కార్మికులను ఏపీకి జగన్ తీసుకొచ్చారో అప్పుడే కేంద్రం కూడా ఆలోచనలో పడింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని రైళ్ళు, బస్సుల ద్వారా ఆయా రాష్ట్రాలు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు, విదేశాల్లో చిక్కుకున్న వారిని మిషన్ వందేభారత్ పేరిట తీసుకొస్తోంది. ఈ విషయంలో జగన్ ను కేంద్రం అనుసరించాల్సి వచ్చింది. ఇక ఎక్కడైనా అనుకోని ప్రమాదం జరిగిన సమయంలోనూ వలస కార్మికుల విషయంలోనూ, ప్రజా సంక్షేమ పథకాలు, నిర్ణయాల అమలులో ఇలా ఏ విషయంలోనూ జగన్ రాజీపడకుండా ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రాధాన్యం ఇవ్వడం, అదే సమయంలో దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకునేలా వ్యవహరిస్తుండడం వంటి పరిణామాలు చూస్తుంటే జగన్ పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగానే కాక, మనసున్న మనిషిగా కూడా ప్రశంసలు అందుకున్నాడు అనడంలో సందేహం లేదు.

 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: