మరాఠీ నేలపై తెలుగు నేతల హల్చల్? స్పీచులు ఓట్లు రాలుస్తాయా?

Chakravarthi Kalyan
లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఆ కిక్కే వేరప్పా..! అన్నట్టుంది మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో మనోళ్ల తీరు. మరాఠీ గడ్డపై ఆఖరిపోరాటంలో తెలుగునేతలే హవా చాటుతున్నారు. ఏపీ, తెలంగాణ పొలిటికల్‌ స్టార్స్ అందరూ మహారాష్ట్రలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు.


మహారాష్ట్ర ఎన్నికలు.. ప్రీక్లైమాక్స్‌కు చేరుకున్నాయి. నవంబర్‌ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మహా సంగ్రామం ఆఖరిఘట్టంలో తెలుగు నేతల ఉనికే ఎక్కువగా ఉంది. అటు ఎన్‌డీఏ.. ఇటు ఇండీ కూటమి పెద్దలు పనిగట్టుకుని చిట్టచివరి అస్త్రంగా తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారు.


మహా వికాస్‌ అఘాడి తరపున తొలి విడత ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. నేడు మరోసారి మహా ప్రచార బరిలోకి దిగుతున్నారు.  తెలంగాణ మంత్రులు సైతం కొన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలు ఉంటూ మహారాష్ట్రలో చురుగ్గా తిరుగుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనవాసరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీతక్కలు కూడా ప్రచారం చేస్తున్నారు.  


మహాయుతి కూటమి తరఫున తెలంగాణ బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు..ఈ సాయంత్రం ముంబయి చేరుకుంటారు. రెండురోజుల పాటు ఎన్‌డీఏ తరఫున చంద్రబాబు ప్రచారం చేస్తారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో పాల్గొంటారు. పవన్‌ కల్యాణ్ కూడా నేడు మహారాష్ట్రకు వెళ్తున్నారు.


పవన్‌ తుపాన్ లాంటివాడంటూ గతంలో మోదీ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం..సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో పవన్ పేల్చిన డైలాగులు మహారాష్ట్రలో పవన్‌కి పాపులారిటీ పెంచేశాయని జనసేన చెప్పుకుంటోంది. పవన్‌ని తిరుగులేని మాస్ లీడర్‌గా, చంద్రబాబును సీనియర్ మోస్ట్ లీడర్‌గా ప్రజంట్ చేస్తూ.. తమ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చుకుంది ఎన్‌డీఏ.   ఇప్పుడు వీళ్లిద్దరి పాపులారిటీ మీద మరాఠీ గడ్డపై మహా యుతి కూటమి నేతలు ఆశలు పెట్టుకున్నారు.

మరాఠీ గడ్డపై దాదాపు 14 లక్షల మంది తెలుగువాళ్లున్నారని ఒక అంచనా ఉంది.


అందుకే.. అక్కడి తెలుగు ఓటుబ్యాంకుల్ని కొల్లగొట్టడానికి మరాఠీ పార్టీలు పోటీపడుతున్నాయి. తెలుగు పొలిటికల్ ఐకాన్లకు ప్రత్యేకంగా షెడ్యూలిచ్చి మరీ ప్రచారాలు చేయించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: