వైసీపీ వరస అరెస్టులతో కూటమి గ్రాఫ్ తగ్గుతుందా..?
హోం మంత్రిత్వ శాఖ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేసేదాకా పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి అరెస్టుల పర్వం ప్రారంభం అయ్యింది. వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు అభిప్రాయం పేరుతో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, ప్రభుత్వ పెద్దల కుటుంబాలను లాగి తీవ్ర పదజాలంతో దూషించడం వంటివి చేస్తే మాత్రం ఎవరూ సహించే అవకాశం ఉండదు. ఎప్పటికే మూడు నాలుగు సార్లు పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. వారి దాడి తగ్గించకపోవడంతో అరెస్టులు ప్రారంభించారు. అయితే కడపలో వర్రా రవీందర్ రెడ్డిఅనే సోషల్ మీడియా యాక్టివిస్టును ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాలతో వదిలేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏకంగా ఎస్పీని బదిలీ చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలు ప్రత్యర్థులు విరుచుకుపడేవారు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే పోలీసులకు ఫిర్యాదు చేసేవారు. వారు ఇట్టే వాలిపోయి అరెస్టులు కొనసాగించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టిడిపి శ్రేణులు సైతం లైట్ తీసుకున్నాయి.
ఏపీలో జరుగుతున్న ప్రతి అంశం పైన ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. అదే పనిగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ హయాంలో టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అర్థరాత్రి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేసి తీసుకుపోయేవారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా మూడు వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా టిడిపి అదే పని చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తాము నాలుగు నెలల పాటు సంయమనం పాటించామని.. సహనానికి ఒక హద్దు ఉంటుందని.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించింది.