పిఠాపురంలో తన్నులాట, డిప్యూటీ సీఎం గారి తాలుకానా?
పిఠాపురం నియోజకవర్గం మరోసారి ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఈ ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. బంపర్ మెజార్టీతో గెలిచారు. కీలకమైన నాలుగు శాఖలకు మంత్రిగా పనిచేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకున్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ గా తయారు చేస్తానని అభివృద్దిలో పరుగులు పెట్టిస్తానని పవన్ హామీ ఇచ్చారు.
గెలిచిన తర్వాత అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్ అయింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు సీనియర్ అధికారులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడమే అందుకు కారణం. అందరూ చూస్తుండగానే ఆ ఇద్దరు అధికారులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సాటి అధికారులు, మున్సిపల్ ఉద్యోగులు, కౌన్సిలర్లు ఒక్కసారిగా బిత్తరపోయారు. అయితే సాధారణంగా వేరే నియోజకవర్గం అయితే ఇది పెద్ద వార్తగా నిలిచేది కాదు. కానీ డిప్యూటీ సీఎం గారి తాలుకా నియోజకవర్గం కావడంతో చర్చకు దారి తీస్తోంది.
దీంతో పిఠాపురం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. పిఠాపురం మున్సిపల్ డీఈగా భవానీ శంకర్ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన చాలా రోజులు సెలవుపై వెళ్లారు. మున్సిపల్ కమిషనర్ గా కనకారావు విధుల్లో ఉన్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. డీఈ భవానీ శంకర్ కార్యాలయంలో ఉండగా. కమిషనర్ ఈఈ సంతకాలు చేయించుకోవడంతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ఈ క్రమంలో మున్పిపాలిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి కమిషనర్ కనకారావు, డీఈ భవానీ శంకర్ లు హాజరు అయ్యారు. కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆవేశానికి గురై ఒకరిని ఒకరు తిట్టుకున్నారు. పక్కన ఉన్న వారు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు. అయితే పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పవన్ ఇప్పటికే పిలుపునిచ్చారు. కానీ అధికారులు తమ స్థాయిని మరిచి కొట్టుకోవడాన్ని పవన్ కల్యాన్ గమనించారో లేదో. మరి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.