డబ్బులకు ఇబ్బందులు పడుతున్న ఇజ్రాయెల్ .!
ఏ యుద్ధం అయినా విధ్వంసంతోనే ముగుస్తుంది. దానివల్ల మౌలిక వసతులు పరంగా, ఆర్థిక పరంగా జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఇక ప్రాణ నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజేతలైనా.. పరాజితులైనా మళ్లీ దెబ్బతిన్న దేశాన్ని పునరుద్ధరించుకోవాల్సిందే. అలాంటి విధ్వంసకర యుద్ధం దేశంలో దీర్ఘకాలం కొనసాగితే నష్టం మరింతగా ఉంటుంది. దాని నుంచి కోలుకోవాలంటే దశాబ్దాలు పట్టవచ్చు.
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల కారణంగా జరుగుతున్న నష్టాన్ని మనం చూస్తూనే ఉన్నాం. యుద్ధాలు ముగిసి మళ్లీ అవి కోలుకోవాలంటే.. ఎంత కాలం పడుతుందో చెప్పడం కష్టం. సరిగ్గా అదే అంశాన్ని ఆర్థిక వేత్తలు గుర్తు చేస్తున్నారు. హమాస్ తో దీర్ఘకాలం యుద్ధాన్ని కొనసాగిస్తే ఇజ్రాయెల్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు.
యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ పర్యాటకం దారుణంగా దెబ్బతింది. చిన్న వ్యాపారాలు మూత పడ్డాయి. రవాణా నౌకా కార్యాకలాపాలు తగ్గుముఖం పట్టాయి. లోట్ బడ్జెట్ పెరిగింది. జెరుసలెం పాత నగరంలో చారిత్రక దుకాణాలన్నీ మూత పడ్డాయి. హైఫా రిటైల్ మార్కెట్ లోని వ్యాపారులు ఈగలు తోలుకుంటున్నారు. విమానాయాన సంస్థలు విమానాలను రద్దు చేసుకుంటున్నాయి. వ్యాపారాలు సాగడం లేదు. విలాస హోటళ్లు సగానికి పైగా ఖాళీగానే ఉంటున్నాయి.
ఇజ్రాయెల్ కు పర్యాటకం ప్రధాన ఆదాయ వనరు కాకపోయినా.. వేల దుఖాలు మూతపడి వాటిలో ఉపాధి పొందే ఉద్యోగులు జీవనోపాధిని కోల్పోయారు. రవాణా నౌకలను హౌతీలు అడ్డుకోవడం వల్ల ఇజ్రాయెల్లో సేదతీరే నౌకలు రావడం లేదు. 11 నెలలుగా యుద్ధం కొనసాగడం ఇది ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోవడంతో ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడింది. ఆర్థిక ఇబ్బంది తాత్కాలికం అని ఆ దేశ ప్రధాని బెంజిమాన్ నెతన్యాహూ చెబుతున్నా.. ఇప్పటికే వేల దుకాణాలు మూత పడి సంక్షోభం తలెత్తింది.
అంతర్జాతీయంగా దేశం విశ్వసనీయత దెబ్బతినడంతో మళ్లీ వ్యాపారాలు పుంజుకోవడంపై ఆందోళన నెలకొంది. యుద్ధం మొత్తం వ్యయం రూ.120 బిలియన్ల అమెరికా డాలర్లు అవుతుంది. ఇది ఇజ్రాయెల్ జీడీపీలో 20శాతానికి సమానం. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో ఉంది.