ఏపీ: టీడీపీ, వైసీపీలను వణికిస్తున్న పోలింగ్‌ శాతం?

Chakravarthi Kalyan
రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలెట్లే కాదు. రికార్డులు సైతం బద్దలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 81.17 శాతం పోలింగ్ నమోదైంది. 2019తో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో పోలింగ్ శాతం తారాజువ్వలా దూసుకుపోయింది. దీంతో రాష్ట్ర చరిత్రలో ఈ పోలింగ్ ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించినట్లయింది.

ఉదయం ఏడు గంటలకు ప్రారంభం అయిన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటలకే ముగిసినా.. దాదాపు 47 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు కొనసాగింది. వీటిలో 34 కేంద్రాల్లో మంగళవారం తెల్లవారుజామున వరకు కొనసాగడం గమనార్హం. ఫలితంగా అంచనాలకు మించి పోలింగ్ నమోదైంది. మరోవైపు 1957 నుంచి మొదలు పెడితే.. 2019 వరకు ఏపీలో జరిగిన అన్ని ఎన్నికల్లో ఇదే రికార్డు స్థాయి పోలింగ్ కావడం విశేషం.

ఈసారి యువత కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొంది.  సర్పంచి ఎన్నికల మాదిరిగా వలస ఓటర్ల కూడా వచ్చారు. అయితే పెరిగిన ఓటింగ్ దేనికి సంకేతం.. గెలిచేదెవరు? నిలిచేదెవరు అనే బలమైన చర్చలు కూడా మొదలయ్యాయి. సంక్షేమ పథకాలు నచ్చి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేశారని అధికార పార్టీ..  ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న కసితో ఓటర్లు పోటెత్తారని విపక్షం చెబుతోంది. పైకి ఎవరికి వారు ధీమాగా కనిపిస్తున్నారు.

అయితే గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ, అర్బన్ ప్రాంతాల్లో టీడీపీ కూటమికి అనుకూలంగా ఓట్లేశారనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. కానీ  పొలింగ్ కొద్ది గంటల ముందు కూడా అన్ని పార్టీలు పాజిటివ్ వాతావరణాన్ని అయితే సృష్టించుకోగలిగాయి. అయితే ఈ సారి ఓటర్లు సైలెంట్ గా ఓటు వేశారని..  ఈసారి అభ్యర్థిని చూసి కాకుండా పార్టీ గుర్తు ఆధారంగా.. మరికొందరు చంద్రబాబు, జగన్ లను చూసి ఓటేశారని పేర్కొంటున్నారు. మొత్తంగా అయితే ఇన్ని రోజులు మంటుడెండను సైతం లెక్కచేయకుండా ప్రచారం చేసిన రాజకీయ నాయకుల కష్టానికి అయితే ఫలితం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: