ఏపీలో ఇక బీజేపీలోకి వైసీపీ వలసలు?

Chakravarthi Kalyan
ఏపీ బీజేపీలో ఎన్నికల సందడి మొదలైంది. కేంద్రమంత్రి  రాజ్ నాథ్ సింగ్ రాకతో ఒక రకమైన మార్పు కనిపిస్తోంది. ఆ పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమకు చెందిన కాపు రామచంద్రారెడ్డి రాజ్ నాథ్ సింగ్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

త్వరలో ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన తో బీజేపీ సర్దుబాటు ప్రారంభం అవుతుందన్న నేపథ్యంలో వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీ బాట పట్టడం గమనార్హం. కాపు రామచంద్రారెడ్డి సీనియర్ నాయకుడు. సీఎం జగన్ కు అత్యంత నమ్మిన బంటు. కానీ జగన్ ఆయనకు టికెట్ నిరాకరించారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంపై సీఎం క్యాంపు కార్యాలయం దగ్గరే రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీకు గుడ్ బై అంటూ సీఎం క్యాంపు కార్యాలయనికి సెల్యూట్ చేశారు.

జగన్ ను నమ్ముకుని వచ్చినందుకు తమ జీవితాలు నాశనం అయ్యాయంటూ వాపోయారు. అయితే ఆయన కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా నడిచింది. షర్మిళ పీసీసీ పగ్గాలు అందుకున్న తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు ఆయన కూడా చేరతారు అని అంతా భావించారు. మరో వైపు కాంగ్రెస్ సీనియర్ సీనియర్ నాయకుడు రఘువీరా రెడ్డి ఆశీర్వాదం తీసుకోవడంతో హస్తం గూటికి ఆయన చేరిక లాంఛనమే అనుకున్నారు. కానీ ఎందుకో ఆయన  ఆ పార్టీలో చేరలేదు.

అయితే తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన రాజ్ నాథ్ సింగ్ ను ఆయన కుటుంబ సమేతంగా కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన తప్పకుండా బీజేపీలో చేరతారు అనే ప్రచారం జరుగుతోంది. అంటే బీజేపీ ఏపీలో ఒంటరిగా బరిలో నిలవనుందా అనే సందేహాలు ఇప్పుడు అందరిలో తలెత్తుతున్నాయి.  కాకపోతే కాపు రామచంద్రారెడ్డితో పాటు ఆయన భార్యకు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ టీడీపీ, జనసేనతో పొత్తు కుదిరితే బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: